Yellamma: ‘బలగం’తో దర్శకుడిగా విజయవంతమైన కమెడియన్ వేణు ఇప్పుడు తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన దర్శకత్వంలో రానున్న ఈ కొత్త సినిమా పేరు ‘ఎల్లమ్మ’. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో మంచి ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ (DSP) నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు సినిమాలకు సంగీతం అందించిన DSP, ఈసారి నటుడిగా కనిపించబోతున్నాడన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం రేపుతోంది. అయితే ఈ విషయంపై సినిమా యూనిట్ నుండి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇదిలా ఉంటే, ఈ ప్రాజెక్టు మొదట నాని కోసం అనుకున్నారనే ప్రచారం జరిగింది. తర్వాత నితిన్, ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పేరు బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.
‘ఎల్లమ్మ’ కథలో హీరో పాత్రకు కొంత కొత్తదనం, ప్రత్యేకత ఉండటంతో దర్శకుడు వేణు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉన్న నటుడిని తీసుకోవాలని అనుకున్నాడట. అందుకే DSP వైపు మొగ్గు చూపినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక DSP నిజంగా ఈ సినిమాలో హీరోగా నటిస్తాడా లేదా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది. అయితే ఆయన నటిస్తే ఇది ఆయన కెరీర్‌లో మరో కొత్త మలుపుగా మారడం ఖాయం.
