Happy Raj: ఒకప్పుడు ‘ప్రేమదేశం’ సినిమాతో భారీ గుర్తింపు పొందిన హీరో అబ్బాస్, 2015 తర్వాత నటనకు దూరమయ్యారు. అప్పటి నుంచి ఆయన రీ-ఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వారి నిరీక్షణకు ముగింపు పలుకుతూ, అబ్బాస్ మళ్లీ తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నారు.
‘హ్యాపీ రాజ్’ అనే తమిళ చిత్రంతో ఆయన రీ-ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 27న తెలుగులో కూడా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో దర్శకుడు మరియా రాజా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమా కథ పూర్తి చేసిన తర్వాత ముందుగా హీరో నవీన్ పొలిశెట్టికి మెయిల్ చేశానని చెప్పారు. ఆయన స్క్రిప్ట్ చదివి కాల్ చేసి దాని గురించి మాట్లాడటం తనకు చాలా నమ్మకాన్ని ఇచ్చిందన్నారు. అయితే అప్పటికే ఇతర ప్రాజెక్ట్స్ ఉండటంతో నవీన్ ఈ సినిమాలో నటించలేకపోయారని తెలిపారు. తర్వాత ఈ కథను జీవీ ప్రకాశ్ కుమార్‌కు చెప్పగా, ఆయన వెంటనే అంగీకరించినట్లు చెప్పారు.
అలాగే అబ్బాస్ రీ-ఎంట్రీ గురించి కూడా ఆయన వివరించారు. మంచి కథ కోసం అబ్బాస్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారని, ఎన్నో కథలు విన్నప్పటికీ ఏదీ నచ్చలేదని చెప్పారు. న్యూజిలాండ్‌లో ఉన్న అబ్బాస్‌కు ఈ కథను ఆన్లైన్లో వివరించగా, వెంటనే ఆయనకు నచ్చి, “ఇది రీ-ఎంట్రీకి సరైన కథ” అని అంగీకరించినట్లు తెలిపారు. అబ్బాస్ ఈ సినిమాలో నటించడానికి ప్రధాన కారణం కథే అని దర్శకుడు పేర్కొన్నారు.
ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకులు వెంకీ అట్లూరి, శివ నిర్వాణ ముఖ్య అతిథులుగా హాజరై, సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. మొత్తం మీద ‘హ్యాపీ రాజ్’ సినిమా అబ్బాస్ రీ-ఎంట్రీకి మంచి ఆరంభం అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Telangana: ఇకపై టెన్త్ పరీక్షలు ఉండవు: సీఎం రేవంత్
Happy Raj: 11 ఏళ్ల తర్వాత అబ్బాస్ ఎంట్రీ.. రిలీజ్ ఎప్పుడంటే..
