Pratyusha: సుమారు ఇరువై సంవత్సరాల క్రితం తెలుగు చిత్రసీమను కలవరపరిచిన నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు మరోసారి చర్చల్లోకి వచ్చింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షపై నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన అప్పీల్, అలాగే శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌లపై సుప్రీంకోర్టు ధర్మాసనం (జస్టిస్ రాజేశ్ బిందల్, జస్టిస్ మన్మోహన్) బుధవారం వాదనలు పూర్తిచేసి తీర్పును రిజర్వ్ చేసింది.
కేసు నేపథ్యం
సినిమాల్లోకి రాకముందే ప్రత్యూషకు, తనతో ఇంటర్ చదువుతున్న సిద్ధార్థ్ రెడ్డితో ప్రేమ ప్రారంభమైంది. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి చేరగా, సిద్ధార్థ్ రెడ్డి ఇంజினీరింగ్ చదువు ప్రారంభించాడు.
2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7.30–8 గంటల మధ్య, ఇద్దరూ పురుగుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగి అత్యవసర పరిస్థితిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించబడ్డారు. ప్రత్యూష ఫిబ్రవరి 24న మరణించగా, చికిత్స అనంతరం సిద్ధార్థ్ రెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు.
మరణ కారణం – వైద్యుల నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం నియమించిన వైద్యుల బృందం నివేదిక ప్రకారం—
-
ప్రత్యూష ఆర్గానోఫాస్ఫేట్ విషం వల్ల మరణించింది
-
ఆమెపై లైంగిక దాడి జరగలేదని స్పష్టం
-
ఊపిరాడకపోవడం, ఇతర నేర చర్యలు లేవని తేల్చారు
దర్యాప్తు & కోర్టు తీర్పులు
సీబీఐ తన దర్యాప్తులో సిద్ధార్థ్ రెడ్డిపై
-
సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం)
-
సెక్షన్ 309 (ఆత్మహత్య యత్నం)
కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది.
2004 ఫిబ్రవరి 23న, హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు:
-
5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష
-
రూ.5,000 జరిమానా
విధించింది.
తర్వాత సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించగా, 2011 డిసెంబర్ 28న హైకోర్టు:
-
శిక్షను 5 ఏళ్ల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించింది
-
జరిమానాను రూ.50,000కు పెంచింది
సుప్రీంకోర్టులో వాదనలు
2012లో సిద్ధార్థ్ రెడ్డి, సరోజినీదేవి ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది.
సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది నచికేత్ జోషి:
-
కేసులోని సాక్ష్యాలు అన్నీ స్పష్టంగా ఉన్నాయని
-
సిద్ధార్థ్ రెడ్డికి సెక్షన్ 302 (హత్య) కింద శిక్ష విధించాలని
-
అది సాధ్యంకాకపోతే కనీసం సెక్షన్ 306 కింద గరిష్ట శిక్ష ఇవ్వాలని వాదించారు.
సిద్ధార్థ్ రెడ్డి తరపున న్యాయవాది నాగముత్తు, ఎల్. నరసింహారెడ్డి:
-
ఇద్దరూ కలిసి పురుగుమందు తాగినప్పుడు
“ఆత్మహత్యకు ప్రేరేపించడం” అనే అంశమే లేదని
వాదించారు.
సుప్రీంకోర్టు ఇరు పక్షాల వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసింది.
