Allu Arjun: ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్–అట్లీ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ చిత్రానికి ‘రాకా’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పోస్టర్‌లో అల్లు అర్జున్ సగం మనిషి, సగం మృగంలా కనిపించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకవైపు పోస్టర్ ఆసక్తిని పెంచుతుండగా, మరోవైపు కొంతమంది ఫ్యాన్స్ మాత్రం దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తం చేస్తున్నారు.
మొదటగా టైటిల్ గురించి మాట్లాడితే, ‘రాకా’ అనే పదానికి సంస్కృతంలో ‘వెన్నెల రాత్రి’ అనే అర్థం ఉంది. తమిళంలో ఈ పదానికి ప్రత్యేక అర్థం లేకపోయినా, ‘రా’ అంటే రాజు లేదా రాజన్, ‘కా’ అంటే రక్షించేవాడు అనే భావన తీసుకుంటే ‘రక్షించే రాజు’ అనే అర్థం కూడా రావచ్చు. అయితే అట్లీ ఈ టైటిల్‌ను ఏ కాన్సెప్ట్‌తో పెట్టారో సినిమా చూసిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.
పోస్టర్‌ను గమనిస్తే, అల్లు అర్జున్ నుదిటిపై ఉన్న ప్రత్యేక గుర్తులు వెంటనే దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కుడివైపు ఉన్న ఆ గుర్తు ఒక నామంలా కనిపించినా, పూర్తిగా అలానే అనిపించదు. అది ఆయన పాత్రకు సంబంధించిన ఒక తెగ గుర్తు అయి ఉండొచ్చని అనిపిస్తుంది. మొత్తం లుక్‌ను బట్టి చూస్తే ఇది గిరిజన నేపథ్యంతో కూడిన పాత్రగా భావించవచ్చు. అలాగే నుదిటిపై ఉన్న చిన్న చిన్న గీతలు ఆ పాత్ర ఎదుర్కొన్న కష్టాలను సూచిస్తున్నాయి.
అల్లు అర్జున్ కళ్లలో కనిపిస్తున్న ఇంటెన్సిటీ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. లేత గోధుమరంగు కనుపాపలతో పాటు ఆయన చూపులో కోపం, ప్రతీకారం వంటి భావాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిని బట్టి ఈ సినిమా రివెంజ్ డ్రామాగా ఉండే అవకాశం ఉందని అనిపిస్తోంది.
ముఖంపై జంతు చర్మం, వెంట్రుకలు కనిపించడం, చేతి వేళ్ల వద్ద ఉన్న గోర్లు భయంకరంగా ఉండటం చూసి, ఈ పాత్ర అడవిలో పెరిగిన వేటగాడి తరహాలో ఉంటుందని అర్థమవుతోంది. కొన్ని కోణాల్లో ఆయన లుక్ తోడేలు లక్షణాలను కూడా గుర్తు చేస్తోంది.
అల్లు అర్జున్ జుట్టు, మీసాలు తెల్లగా కనిపించడం వల్ల ఈ పాత్రకు వయసు పైబడినట్లు కూడా అనిపిస్తోంది. మొత్తంగా ఈ ఫస్ట్ లుక్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతోంది. ఏదో కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని అర్థమవుతోంది.
ఇక ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఉండొచ్చని కూడా ప్రచారం జరుగుతోంది. ప్రపంచాన్ని నాశనం చేయాలనుకునే శక్తులను అడ్డుకునేందుకు శాస్త్రవేత్తలు అల్లు అర్జున్ పాత్రను ప్రత్యేకంగా మార్చారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్‌లో కనిపిస్తారని వార్తలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం విడుదలైన ఈ లుక్ వాటిలో ఒక పాత్రకు మాత్రమే సంబంధించినదై ఉండొచ్చని భావిస్తున్నారు. అంటే సినిమాలో ఈ పాత్రకు పరిమిత సమయం ఉండే అవకాశం ఉంది.
సన్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే, అట్లీ ఈ సినిమాతో ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: TVK Vijay: విజయ్ ర్యాలీలో మరోసారి ప్రమాదం
Allu Arjun: అల్లు అర్జున్ ‘రాకా’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
