Gold Loan: మీ వద్ద బంగారం ఉంటే అత్యవసర సమయంలో దానిని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందవచ్చు. భారత్‌లో గోల్డ్ లోన్స్ త్వరగా లభించే రుణాల్లో ఒకటి. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం వల్ల చాలా మంది ఈ రుణాలను తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు 8.25 శాతం నుంచి ప్రారంభమయ్యే తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్లు అందిస్తున్నాయి.
గోల్డ్ లోన్ పొందడం చాలా సులభం. బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టి రుణం తీసుకోవచ్చు. ఎక్కువ డాక్యుమెంట్లు అవసరం ఉండవు. క్రెడిట్ హిస్టరీ కూడా పెద్దగా పరిశీలించరు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో త్వరగా డబ్బు అవసరమైనప్పుడు చాలా మంది ఈ రుణాన్ని ఎంచుకుంటారు.
ఎంత వరకు లోన్ పొందొచ్చు?
భారత్‌లో సాధారణంగా రూ.1,500 నుంచి రూ.1.5 కోటి వరకు గోల్డ్ లోన్ పొందే అవకాశం ఉంటుంది. అయితే మీ వద్ద ఉన్న బంగారం విలువ, అలాగే బ్యాంకు నిబంధనలపై లోన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. రుణాన్ని తిరిగి చెల్లించే గడువు సాధారణంగా 3 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు తమ ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ ఎంచుకోవచ్చు.
గోల్డ్ లోన్లు ఎందుకు తక్కువ వడ్డీకి లభిస్తాయి?
గోల్డ్ లోన్లు సెక్యూర్డ్ లోన్స్ కావడం వల్ల బ్యాంకులకు రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రుణానికి బంగారం తాకట్టు ఉంటుంది. అందుకే ఇతర రుణాలతో పోలిస్తే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఈ రుణాన్ని ఎడ్యుకేషన్, మెడికల్ ఎమర్జెన్సీ, ట్రావెల్, బిజినెస్ అవసరాలు లేదా ఇతర ఖర్చుల కోసం ఉపయోగించుకోవచ్చు.
ప్రముఖ బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు
బ్యాంక్‌బజార్ వెబ్సైట్ సమాచారం ప్రకారం (2026 ఫిబ్రవరి 2 నాటికి) కొన్ని బ్యాంకుల్లో గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి:
- పీఎన్బీ (PNB) – 8.25% నుంచి ప్రారంభం
- బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర – 8.50% నుంచి ప్రారంభం (రూ.20,000 నుంచి రూ.1 కోటి వరకు)
- ఎస్బీఐ (SBI) – 8.70% నుంచి ప్రారంభం (రూ.20,000 నుంచి రూ.50 లక్షల వరకు)
- బ్యాంక్ ఆఫ్ బరోడా – 9% నుంచి ప్రారంభం (గరిష్టంగా రూ.50 లక్షల వరకు)
- యాక్సిస్ బ్యాంక్ – 9.75% నుంచి 17% వరకు (రూ.25,001 నుంచి రూ.4 లక్షల వరకు)
- హెచ్డీఎఫ్సీ బ్యాంక్ – 11.91% నుంచి ప్రారంభం
- ముత్తూట్ ఫైనాన్స్ – 13.90% నుంచి ప్రారంభం (రూ.1,000 నుంచి లోన్ లభ్యం)
ఈ వివరాలు చూస్తే ప్రస్తుతం పీఎన్బీ గోల్డ్ లోన్ వడ్డీ రేటు అత్యల్పంగా ఉండటం గమనించవచ్చు.
అదనపు ఛార్జీలపై జాగ్రత్త
గోల్డ్ లోన్ తీసుకునే ముందు కొన్ని అదనపు ఖర్చులను కూడా గుర్తుంచుకోవాలి. సాధారణంగా ప్రాసెసింగ్ ఫీజు 0% నుంచి 2% వరకు ఉండవచ్చు. దీనిపై జీఎస్టీ కూడా వర్తిస్తుంది. కొన్ని సందర్భాల్లో వ్యాల్యుయేషన్ ఛార్జీలు లేదా ముందుగా రుణం చెల్లిస్తే ప్రీపేమెంట్ పెనాల్టీ కూడా ఉండవచ్చు.
అలాగే గోల్డ్ లోన్ మొత్తం లోన్ టు వ్యాల్యూ (LTV) రేషియో ఆధారంగా నిర్ణయిస్తారు. సాధారణంగా ఇది సుమారు 75% వరకు ఉంటుంది. అంటే మీ బంగారం విలువలో సుమారు 75 శాతం వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది.
అందుకే గోల్డ్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ఛార్జీలు, నిబంధనలు అన్నింటిని సరిగా పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
