LPG Price: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

LPG cylinder price hiked by Rs 195.50

LPG cylinder price hiked by Rs 195.50

LPG Price: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ జరుగుతున్న ఘర్షణల కారణంగా గ్యాస్, చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడి అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. భారతదేశంపై కూడా ఈ ప్రభావం పడుతోంది.

తాజాగా కేంద్ర ప్రభుత్వం వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతూ మరోసారి షాక్ ఇచ్చింది. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.195.50 పెంచడంతో, కొత్త ధర దాదాపు రూ.2,000 దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.2,078.50కు చేరుకుంది. అయితే గృహ వినియోగదారులకు మాత్రం ఊరట కల్పిస్తూ, వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు.

పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన వెంటనే, మార్చి 1న 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను రూ.114.50 పెంచారు. ఇప్పుడు మరోసారి పెంపుతో ధరలు మరింత పెరిగాయి. మరోవైపు, మార్చి 7న గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.60 పెంచిన తర్వాత ఇప్పటివరకు స్థిరంగానే కొనసాగుతోంది.

ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి చమురు సంస్థలు ప్రతి నెలా అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, మారకపు విలువలను బట్టి ధరలను సమీక్షిస్తాయి. ఈసారి గృహ వినియోగదారులకు ఉపశమనం ఇస్తూనే, వాణిజ్య సిలిండర్ ధరలను పెంచడం జరిగింది.

ఇక వాహనదారులకు మాత్రం కొంత ఊరట లభిస్తోంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు లేవు. గత ఏడాది మార్చిలో లీటరుకు రూ.2 తగ్గించిన తర్వాత అదే ధరలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటరు రూ.94.72, డీజిల్ లీటరు రూ.87.62గా అమ్ముడవుతోంది.

Also Read: Viral: ‘నాకు ఎవరూ లేరు సార్.. మీరే నాకు అమ్మా నాన్న! పాస్‌ చేయండి సార్‌..’

LPG Price: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర