LPG Shortage: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు భారతదేశంలో గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది. ఎల్పీజీ సిలిండర్ల కొరత పెరగడంతో కొంతమంది అక్రమ వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో భారీగా దోపిడీ చేస్తున్నారు. ఒకప్పుడు సుమారు రూ.900 నుంచి రూ.1,000 మధ్య లభించిన గ్యాస్ సిలిండర్ ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో రూ.6,500 వరకు అమ్ముతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేవలం రీఫిల్ చేయించుకోవాలంటే కూడా రూ.3,500 నుంచి రూ.4,000 వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్–అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిని కొందరు అక్రమ వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకొని బ్లాక్ మార్కెట్ వ్యాపారాన్ని పెంచుతున్నారని చెబుతున్నారు. ఢిల్లీ వంటి పెద్ద నగరాల్లో కొన్ని స్మార్ట్‌ఫోన్ రిపేర్ షాపులు, కిరాణా దుకాణాల వెనుక గుప్తంగా గ్యాస్ సిలిండర్ల అక్రమ విక్రయాలు జరుగుతున్నట్లు ఒక మీడియా ఛానల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటపడింది.
రాజస్థాన్‌లోని విద్యా కేంద్రం కోటాలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. అక్కడ ఉన్న హాస్టళ్లు, మెస్ నిర్వాహకులకు రోజుకు 600 నుంచి 700 సిలిండర్లు అవసరం ఉంటుంది. కానీ సరఫరా తగ్గిపోవడంతో విద్యార్థులకు భోజనం పెట్టడం కూడా కష్టంగా మారిందని చెబుతున్నారు. ప్రభుత్వం కోటా కేటాయిస్తామని చెప్పినప్పటికీ అది ఇంకా అమలులోకి రాకపోవడంతో, కొందరు నిర్వాహకులు బ్లాక్ మార్కెట్లో రూ.3,500 వరకు చెల్లించి సిలిండర్లు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా గ్యాస్ కొరతపై పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పందించారు. దేశంలో తగినంత చమురు, గ్యాస్ నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. సాధారణంగా రోజుకు 55 లక్షల గ్యాస్ బుకింగ్‌లు జరిగేవని, కానీ ప్రస్తుతం భయంతో ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల ఈ సంఖ్య 88 లక్షలకు పెరిగిందని చెప్పారు. ఈ పరిస్థితి కృత్రిమ కొరతకు కారణమైందని ఆమె పేర్కొన్నారు.
అలాగే దేశంలోని 29 రాష్ట్రాల్లో కమర్షియల్ గ్యాస్ పంపిణీ కొనసాగుతోందని, అక్రమంగా నిల్వలు చేసి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
భారత్ తన ఎల్పీజీ అవసరాలలో సుమారు 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అందులో 85 నుంచి 90 శాతం వరకు గల్ఫ్ దేశాల నుంచే వస్తుంది. అమెరికా–ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ హార్ముజ్ జలసంధిపై పరిమితులు విధించడంతో సరఫరాపై ప్రభావం పడిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో వినియోగదారులు అధికారిక మార్గాల్లోనే గ్యాస్ బుకింగ్ చేసుకోవాలని, బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహించవద్దని ప్రభుత్వం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది.
