WhatsApp: ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సాప్‌పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. యూజర్ల డేటా ప్రైవసీ విషయంలో వాట్సాప్‌ను నమ్మలేమని ఆయన వ్యాఖ్యానించారు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ అందిస్తున్నామని చెప్పినా, వాస్తవంగా యూజర్ల ప్రైవేట్ మెస్సేజ్‌లను చదవడం, స్టోర్ చేయడం జరుగుతోందని ఆరోపిస్తూ దాఖలైన క్లాస్ యాక్షన్ పిటిషన్ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వినియోగదారులు మెసేజ్‌లు, ఆడియో, వీడియో కాల్స్ కోసం X చాట్‌కు మారాలని కూడా సూచించారు.
మస్క్ ఆరోపణల ప్రకారం, మెటా యాజమాన్యంలోని వాట్సాప్ యూజర్ల ప్రైవేట్ సందేశాలను యాక్సెస్ చేస్తోందని, వాటిని యాక్సెంచర్ వంటి థర్డ్ పార్టీ సంస్థలతో పంచుకుంటోందని పేర్కొన్నారు. యూజర్ల డేటా భద్రత ఎక్కడుందని ప్రశ్నించారు.
ఇక ఈ ఆరోపణలపై వాట్సాప్, మెటా సంస్థలు తీవ్రంగా స్పందించాయి. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని, ఆధారంలేనివని ఖండించాయి. వాట్సాప్ దశాబ్ద కాలంగా సిగ్నల్ ప్రోటోకాల్ ఆధారంగా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉపయోగిస్తోందని స్పష్టం చేసింది. అంటే మెస్సేజ్ పంపిన వ్యక్తి, అందుకున్న వ్యక్తి తప్ప మరెవరూ వాటిని చదవలేరని తెలిపింది. వాట్సాప్ కూడా యూజర్ల చాట్‌ను చూడలేదని, వినలేదని పేర్కొంది. సందేశాలు పూర్తిగా లాక్‌డ్‌గా ఉంటాయని, వాటిని అన్‌లాక్ చేసే కీ కేవలం సెండర్, రిసీవర్ వద్ద మాత్రమే ఉంటుందని వివరించింది.
ఇదిలా ఉండగా, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌పై కొన్ని ఆరోపణల నేపథ్యంలో అమెరికాలో విచారణ జరుగుతోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, మాజీ మెటా కాంట్రాక్టర్ చేసిన ఆరోపణలపై అమెరికా లా ఏజెన్సీలు దర్యాప్తు చేపట్టాయి. ఈ విచారణను అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌కు చెందిన ప్రత్యేక ఏజెంట్లు నిర్వహిస్తున్నారు. ఇదే విషయంపై 2024లో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వద్ద కూడా విజిల్‌బ్లోయర్ ఫిర్యాదు నమోదైంది.
గతంలో వాట్సాప్ కంటెంట్ మోడరేషన్‌లో పనిచేసిన కొందరు వ్యక్తులు కూడా సంచలన విషయాలు వెల్లడించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మెటా సంస్థలోని కొంతమంది సిబ్బందికి వాట్సాప్ మెస్సేజ్‌లకు యాక్సెస్ ఉన్నట్లు, యాక్సెంచర్ వంటి కన్సల్టింగ్ సంస్థ ఉద్యోగులకు కూడా ఈ అవకాశం కల్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. కొన్ని వర్క్ లొకేషన్లలో వాట్సాప్ యాక్సెస్ ఉన్నట్లు ఆధారాలు లభించాయని ఒక దర్యాప్తు అధికారి తెలిపినట్లు సమాచారం.
ఇటీవల దాఖలైన క్లాస్ యాక్షన్ పిటిషన్‌లో కూడా ఇదే విషయాలు ప్రస్తావించారు. వాట్సాప్ సందేశాలు పూర్తిగా ప్రైవేట్ కావని, మెటా, యాక్సెంచర్ సంస్థలు యూజర్ల మెస్సేజ్‌లను చదవడం, స్టోర్ చేయడం, థర్డ్ పార్టీలతో పంచుకోవడం జరుగుతోందని పిటిషనర్లు ఆరోపించారు. వినియోగదారులకు సురక్షితమైన ప్లాట్‌ఫామ్‌గా ప్రచారం చేసినప్పటికీ, వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వారు పేర్కొన్నారు.
అయితే ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది ప్రస్తుతం విచారణలో ఉంది. మొత్తంగా, యూజర్ల డేటా ప్రైవసీపై చర్చ మరింత ముదురుతోంది.
