Chicken Shops: ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్

Chicken shops shut across Telangana

Chicken shops shut across Telangana

Chicken Shops: నాన్‌వెజ్ ప్రియులకు ఇది ఒక షాకింగ్ వార్త. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని రాష్ట్ర చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. రిటైల్ చికెన్ సెంటర్లకు ఇచ్చే మార్జిన్ పెంచాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనకు దిగినట్లు వెల్లడించింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించడంతో తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వ్యాపారులు చెబుతున్నారు.

చికెన్ షాపుల నిర్వహణ ఖర్చులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ లాభాలు మాత్రం తగ్గిపోతున్నాయని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కిలో చికెన్‌పై రూ.30 నుంచి రూ.35 వరకు లాభం మిగిలేదని, ఇప్పుడు అన్ని ఖర్చులు తీసేసిన తర్వాత రూ.5 నుంచి రూ.6 మాత్రమే మిగులుతోందని వారు చెబుతున్నారు. షాపు అద్దె, కరెంట్ బిల్లు, పనివారి జీతాలు, నీటి ఖర్చులు వంటి వ్యయాలు భారీగా పెరిగాయని తెలిపారు.

సాధారణంగా ఒక కిలో బతికున్న కోడి ధర రూ.120 ఉంటే, దాన్ని కట్ చేసిన తర్వాత సుమారు 750 గ్రాముల మాంసమే వస్తుంది. దీంతో కిలో చికెన్ ధర రూ.160కి చేరుతుంది. దాన్ని కస్టమర్లకు రూ.200కి అమ్మితే రూ.40 లాభం ఉన్నట్లు కనిపించినా, వాస్తవానికి వివిధ ఖర్చులు తీసేసిన తర్వాత చాలా తక్కువ మిగులుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే అమ్ముడుపోని స్టాక్, వేస్టేజ్ వంటి సమస్యలు కూడా ఉంటాయని పేర్కొన్నారు.

ఇక పౌల్ట్రీ కంపెనీలు మాత్రం ఫీడ్, రవాణా ఖర్చులు పెరిగిన కారణంగా మార్జిన్ తగ్గించాల్సి వచ్చిందని చెబుతున్నాయి. గతంలో కిలోకు రూ.15 నుంచి రూ.20 వరకు ఉన్న మార్జిన్‌ను ప్రస్తుతం రూ.8 నుంచి రూ.10కి తగ్గించడంతో తాము నష్టాల్లోకి వెళ్లిపోయామని చికెన్ షాపుల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హోటళ్లు, బల్క్ కొనుగోలుదారులతో పాత ధరలకే ఒప్పందాలు చేసుకున్నామని, ఇప్పుడు మార్జిన్ తగ్గడం వల్ల నష్టం పెరుగుతోందని తెలిపారు.

తమ డిమాండ్ల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన చేపట్టాలని అసోసియేషన్ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చికెన్ షాపుల యజమానులంతా ఈ బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంపుపై స్పందించే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అలాగే అసోసియేషన్ నిర్ణయాన్ని ఉల్లంఘించి షాపులు తెరిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ బంద్‌కు వినియోగదారులు కూడా సహకరించాలని కోరింది. హైదరాబాద్ నగరంలోనే సుమారు 8 వేల నుంచి 10 వేల వరకు చికెన్ షాపులు ఉండగా, తెలంగాణవ్యాప్తంగా దాదాపు 50 వేల రిటైల్ చికెన్ సెంటర్లు ఉన్నాయని అంచనా. ఈ వ్యాపారంపై లక్షలాది మంది ఆధారపడి జీవిస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో షాపులు మూతపడితే తీవ్రమైన ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

Also Read: LPG Price: భారీగా పెరిగిన కమర్షియల్ సిలిండర్ ధర

Chicken Shops: ఇవాళ్టి నుంచి చికెన్ షాపులు బంద్