Bharat Taxi: ఓలా, ఉబర్‌లకు ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ‘భారత్ ట్యాక్సీ’ రానుంది. సహకార పద్ధతిలో నడిచే ఈ సేవలో క్యాబ్ నిర్వాహకుల నుంచి ఎలాంటి కమిషన్లు తీసుకోరు. ఇలా చేయడం వల్ల డ్రైవర్లు, క్యాబ్ యజమానులు, అలాగే ప్రయాణికులకు కూడా లాభం కలుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం ఓలా, ఉబర్ సంస్థలు డ్రైవర్ల నుంచి 25 శాతం వరకు కమిషన్ వసూలు చేస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. అలాగే ప్రయాణాన్ని రద్దు చేయడం, పీక్ టైం ఛార్జీలు వంటి పేర్లతో ప్రయాణికుల నుంచి అధిక మొత్తాలు వసూలు చేస్తున్నాయని కూడా అపనింద ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్త సేవను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు.
ఈ నేపథ్యంలో కేంద్ర సహకారశాఖ మరియు నేషనల్ ఈ-గవర్నెన్స్ డివిజన్ (ఎన్‌ఈజీడీ) కలిసి ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ పేరుతో సంస్థను స్థాపించారు. దీని కోసం రూ.300 కోట్ల మూలధనాన్ని కేటాయించారు. ఈ సేవలో క్యాబ్ యజమానులు రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే ప్రయాణ చార్జీ మొత్తం డ్రైవర్‌కే అందుతుంది.
భారత్ ట్యాక్సీ ప్రారంభ ప్రణాళిక
-
నవంబర్ నుండి ఢిల్లీలో పైలట్ ప్రాజెక్టుగా 650 క్యాబ్‌లతో ప్రారంభం
-
డిసెంబర్ నాటికి ముంబై, పుణే, భోపాల్, లక్నో, జైపూర్ తదితర 20 నగరాలకు విస్తరణ
-
వచ్చే సంవత్సరం మార్చి నాటికి ప్రధాన నగరాలన్నింటిలో సేవలు ప్రారంభం
-
2030 నాటికి లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ సేవతో అనుసంధానం చేయాలనే లక్ష్యం
‘భారత్ ట్యాక్సీ’ ప్రధాన ఉద్దేశ్యం:
-
డ్రైవర్లు న్యాయమైన ఆదాయం పొందేలా చేయడం
-
ప్రయాణికులు సముచిత ధరకు సేవలు పొందేలా చూడడం
-
మధ్యవర్తి కమిషన్ వ్యవస్థను తగ్గించడం
