Nag Chavithi: నాగుల చవితి మన హిందూ సంప్రదాయంలో అత్యంత భక్తితో జరుపుకునే పండుగ. కార్తీక మాసంలో వచ్చే శుద్ధ చవితి నాడు ఈ పండగను జరుపుతారు. ఈ రోజున నాగ దేవతలను పూజించడం వల్ల కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం లాంటివి తొలగుతాయని పురాణాలు చెబుతాయి. అందుకే, ఈ రోజు భక్తులు సమీపంలోని దేవాలయాల్లోని పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేస్తారు.
ఈ సందర్భంలో పుట్టలో పాలు పోయడం అనేది చాలా కాలంగా వస్తున్న ఆచారం. పుట్టను సుబ్రహ్మణ్యస్వామి లేదా నాగ దేవత ఆలయంగా భావించి భక్తులు చలిమిడి, చిమ్మిలి, అరటిపండ్లు, కొబ్బరికాయ వంటి నైవేద్యాలు సమర్పిస్తారు.
అయితే, పుట్టలో పాలు పోయడంలో అసలు ఉద్దేశ్యం ఏమిటి?
దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు ఆయన ఆ పదార్థాన్ని కాదు, మన భక్తిని స్వీకరిస్తాడని మనం నమ్ముతాము. అదే విధంగా, నాగుల చవితి రోజున పుట్టలో పోసే పాలు పాము తాగకపోయినా, మన భక్తి, మనం చూపే ప్రేమ, గౌరవమే నాగ దేవతకు ముఖ్యమని భావిస్తారు.
భక్తుని నిజమైన మనసును చూసే నాగ దేవత సంతోషించి, ఆయురారోగ్యాలు, సంతానం, ఇంట్లో శాంతి, సంపద వంటి శుభఫలాలను ప్రసాదిస్తారని విశ్వాసం.
అందువల్ల, పుట్టలో పాలు పోయడం అనేది పాములకోసం కాదు…
నాగ దేవత పట్ల మన విశ్వాసం, నమస్కారం, భక్తిని వ్యక్తం చేసే ఆధ్యాత్మిక సంకేతం.
