Paracetamol: డోసు పెరిగితే టికెట్ కన్ఫార్మ్.. ప్రతిదానికీ పారాసెటమాల్ వాడుతున్నారా?

Paracetamol – uses, side effects and how to take it

Paracetamol – uses, side effects and how to take it

Paracetamol: ఈ రోజుల్లో పారాసెటమాల్ వినియోగం చాలా సాధారణమైపోయింది. తలనొప్పి, జ్వరం లేదా చిన్నపాటి నొప్పులు వచ్చినప్పుడు చాలా మంది వైద్యుల సలహా లేకుండా ఈ మందు వాడుతున్నారు.

అయితే తాజాగా జరిగిన ఒక అధ్యయనం ప్రకారం, ముఖ్యంగా వృద్ధులలో పారాసెటమాల్ వినియోగం మూత్రపిండాలు, గుండె వంటి ముఖ్య అవయవాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తేలింది. మరి ఈ ఔషధం శరీరంలో ఎలా పనిచేస్తుంది? దీని వలన ఏ సమస్యలు వస్తాయి? వాటి నివారణకు ఏం చేయాలి? చూద్దాం.

పారాసెటమాల్ ఎలా పనిచేస్తుంది?

పారాసెటమాల్ అనేది సాధారణంగా జ్వరాన్ని తగ్గించడానికి, నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే ఔషధం. ఇది మెదడులో నొప్పి, జ్వరం కలిగించే రసాయనాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. తేలికపాటి నుండి మితమైన నొప్పులు, జ్వరం, మైగ్రేన్, ఆర్థరైటిస్ వంటి సమస్యల కోసం వైద్యులు దీన్ని సూచిస్తారు. అయితే దీన్ని మితంగా, వైద్యుని సలహా మేరకే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో లేదా దీర్ఘకాలంగా తీసుకుంటే శరీరంలోని కీలక అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.

అధ్యయనంలో బయటపడ్డ విషయాలు

బ్రిటన్‌లోని నాటింగ్‌హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం, పారాసెటమాల్‌ను ఎక్కువ కాలం, అధిక మోతాదులో తీసుకోవడం జీర్ణవ్యవస్థ, కిడ్నీలపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా వృద్ధులు దీన్ని నిరంతరం వాడితే ప్రమాదం మరింత ఎక్కువ. దీర్ఘకాల వినియోగం వల్ల కడుపులో అల్సర్లు వచ్చే అవకాశం ఉంది. ఇది కడుపు పొరను దెబ్బతీసి జీర్ణ సమస్యలకు దారితీస్తుంది. అలాగే కిడ్నీల పనితీరును బలహీనపరుస్తుంది. కిడ్నీలు శరీరం నుండి విషపదార్థాలను తొలగించే పనిని చేస్తాయి. అవి ఇప్పటికే బలహీనంగా ఉన్న వృద్ధుల్లో ఈ ఔషధం మరింత ఒత్తిడిని కలిగిస్తుంది.

అంతేకాకుండా, పారాసెటమాల్ ప్రభావం గుండెపైనా ఉంటుంది. దీన్ని ఎక్కువ కాలం వాడితే రక్తపోటు పెరగడం, గుండె పనితీరు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఏమి చేయాలి?

పారాసెటమాల్‌ను ఎప్పుడూ వైద్యుని సలహా లేకుండా వాడకూడదు. చిన్న చిన్న నొప్పులు లేదా జ్వరం వచ్చినప్పుడల్లా దీన్ని తీసుకోవడం మంచిది కాదు. బదులుగా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, క్రమబద్ధమైన జీవనశైలిని అలవరచుకోవాలి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ద్వారా మందుల అవసరం తగ్గుతుంది.

మొత్తం మీద, పారాసెటమాల్ ఉపయోగకరమైన ఔషధమే కానీ నిర్లక్ష్యంగా వాడితే శరీరానికి హాని కలిగించే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వైద్యుల సూచన మేరకే వాడటం ఉత్తమం.

Also Read: Social Media: సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందని.. గర్ల్ ఫ్రెండ్ గొంతు కోసి హత్య

Paracetamol: డోసు పెరిగితే టికెట్ కన్ఫార్మ్.. ప్రతిదానికీ పారాసెటమాల్ వాడుతున్నారా?