Sugar: చక్కెర మానేస్తే శరీరంలో వచ్చే మార్పులివే..!!

What Happens to Your Body When You Cut Out Sugar

What Happens to Your Body When You Cut Out Sugar

Sugar: భారత పట్టణాల్లో నివసించే కుటుంబాల్లో 56% మంది నెలకు కనీసం మూడు సార్లు కేకులు, చాక్లెట్లు, బిస్కెట్లు, ఐస్‌క్రీమ్ వంటి స్వీట్లను తీసుకుంటున్నారని ఒక తాజా అధ్యయనం తెలిపింది. వారిలో 18% మందికి అయితే ప్రతిరోజూ ఈ స్వీట్లు తినే అలవాటు ఉందని వెల్లడైంది.

ఇదిలా ఉండగా, అధ్యయనంలో పాల్గొన్న వారిలో సగానికి పైగా (55%) మంది స్వీట్లు మానలేమని, కానీ అవి తక్కువ చక్కెరతో ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రజల్లో తాము తినే ఆహారంలో ఎంత చక్కెర ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరుగుతుండటం గమనార్హం. అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయనే అవగాహన పెరుగుతోంది.

ఇటీవలి రోజుల్లో “షుగర్ కట్ ఛాలెంజ్” అనే ట్రెండ్ కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. కొన్ని రోజులు యాడెడ్ షుగర్ ఉన్న అన్ని రకాల ఆహారాలను పూర్తిగా మానేయడం ఇందులో భాగం. “10 రోజులు చక్కెర మానేశాక నా చర్మం మెరుస్తోంది”, “బరువు తగ్గాను” అంటూ చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.

అయితే, చక్కెరను పూర్తిగా మానేస్తే ఏమవుతుంది? దీనికి సమాధానం చెప్పేముందు చక్కెర రకాల గురించి తెలుసుకోవాలి.

ఆహారాలకు తయారీ సమయంలో కలిపే తెల్ల చక్కెర, గోధుమ చక్కెర, తేనె, బెల్లం, డ్రైఫ్రూట్స్, బిస్కెట్లు, కేకులు, శీతల పానీయాల్లోని మిఠాసు — ఇవన్నీ ‘యాడెడ్ షుగర్స్’గానే పరిగణిస్తారు. ఇవి సహజసిద్ధమైనవైనా, కలిపే ప్రక్రియ కారణంగా యాడెడ్ షుగర్స్‌గా లెక్కిస్తారు. వీటిని అధికంగా తీసుకోవడం ప్రమాదకరం అని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి.

ఆదరహాక, పాలు, పండ్లు, కూరగాయలలో సహజంగా ఉండే చక్కెర మాత్రం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. 2023లో లాన్సెట్ అధ్యయనం ప్రకారం భారతదేశంలో దాదాపు 10.1 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారు. గోవా, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలు అత్యధిక కేసులు కలిగినవిగా గుర్తించబడ్డాయి.

“ఇది కేవలం మధుమేహ సమస్య మాత్రమే కాదు. అధిక యాడెడ్ షుగర్‌ వల్ల టైప్-2 మధుమేహం, ఇన్సులిన్ నిరోధకత, ఊబకాయం, ఫ్యాటీ లివర్, దంత సమస్యలు, గుండె జబ్బులు వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి” అని చెన్నై వైద్య నిపుణురాలు డాక్టర్ సింథియా దినేష్ చెప్పారు.

మన శరీరానికి గ్లూకోజ్ అవసరం ఉన్నా, దాన్ని ప్రత్యేకంగా చక్కెర రూపంలో తీసుకోవాల్సిన అవసరం లేదని యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్పష్టం చేస్తోంది. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రోటీన్లను శరీరం విచ్ఛిన్నం చేసి అవసరమైన గ్లూకోజ్ తయారు చేసుకుంటుందని తెలిపింది.

హార్వర్డ్ మెడికల్ స్కూల్ ప్రకారం పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, పాల ఉత్పత్తుల్లోని సహజ చక్కెరలతో పాటు ఫైబర్, ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి నెమ్మదిగా శక్తిని అందించడమే కాకుండా, మధుమేహం, గుండెజబ్బులు తగ్గించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, ఒక నారింజ తింటే చక్కెరతో పాటు ఫైబర్, విటమిన్లు కూడా లభిస్తాయి.

యాడెడ్ షుగర్ మానేస్తే ఆరోగ్యానికి త్వరగానే లాభాలు కనిపిస్తాయని డాక్టర్ సింథియా చెబుతున్నారు. తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల దంత ఆరోగ్యం మెరుగుపడటం, బరువు తగ్గడం వంటివి జరుగుతాయని తెలిపారు. అయితే ఎక్కువ చక్కెర తీసుకునే వారికి మొదటి రోజుల్లో అలసట, తలనొప్పి, మూడ్ మార్పులు కనిపించవచ్చని అన్నారు. చాలామంది రోజూ కాఫీలో 4–6 చెంచాల చక్కెర వేసుకుంటారని పోషక నిపుణురాలు తరిణి కృష్ణన్ చెప్పారు.

అమెరికాలో ఊబకాయం ఉన్న పిల్లలపై చేసిన అధ్యయనంలో 10రోజులు యాడెడ్ షుగర్ మానేసినా, బరువులో పెద్ద మార్పు లేకపోయినా, రక్తపోటు, కొలెస్ట్రాల్ మెరుగుపడ్డాయని తేలింది.

“యాడెడ్ షుగర్ తగ్గిస్తే 5–6 రోజుల్లో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 7–8 రోజుల్లో మానసిక స్థితి బాగుంటుంది. 9–10 రోజులకు చర్మం ప్రకాశిస్తుంది. డయాబెటిక్ రోగులు 3–5 రోజుల్లోనే షుగర్ లెవల్స్‌లో మార్పు చూస్తారు” అని సింథియా తెలిపారు.

బరువులో గణనీయమైన మార్పు రావాలంటే నెలరోజులు యాడెడ్ షుగర్‌ మానాలని, ఇది డైటీషియన్ పర్యవేక్షణలో చేయాలని వారు సూచిస్తున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం రోజువారీ కేలరీల్లో 10% కంటే ఎక్కువ యాడెడ్ షుగర్ ఉండకూడదు. 5%కి తగ్గిస్తే మరింత మంచిది.

యూకే ఆరోగ్య సేవా మార్గదర్శకాలు ఇలా సూచిస్తున్నాయి:

  • పెద్దలు రోజుకు 30 గ్రాములకు మించకుండా

  • 7–10 ఏళ్ల పిల్లలు 24 గ్రాములకు మించకుండా

  • 4–6 ఏళ్ల పిల్లలు 19 గ్రాములకు మించకుండా

  • 2–3 ఏళ్ల పిల్లలు 14 గ్రాములకు మించకుండా యాడెడ్ షుగర్ తీసుకోవాలి.

మధుమేహ రోగులు యాడెడ్ షుగర్ పూర్తిగా మానేయడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. జామ, ఆపిల్, క్యారెట్, పాలు వంటి తక్కువ GI ఉన్న ఆహారాలను పరిమితంగా తీసుకోవచ్చు.

Also Read: Meera Vasudevan: ముచ్చటగా మూడో భర్తతోనూ విడాకులు తీసుకున్న హీరోయిన్

Sugar: చక్కెర మానేస్తే శరీరంలో వచ్చే మార్పులివే..!!