The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే

The Kerala Story 2: High Court stays release of movie

The Kerala Story 2: High Court stays release of movie

The Kerala Story 2: వివాదాల మధ్య విడుదలకు సిద్ధమైన ‘ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్’ సినిమాకు కేరళ హైకోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావాల్సిన ఈ చిత్రంపై మధ్యంతర స్టే విధిస్తూ, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు విడుదలను నిలిపివేయాలని ఆదేశించింది.

2023లో తీవ్ర చర్చల నడుమ విడుదలైన ‘ది కేరళ స్టోరీ’ చిత్రానికి ఇది సీక్వెల్‌గా రూపొందింది. టీజర్, ట్రైలర్ విడుదలైన తర్వాత నుంచే ఈ సినిమాపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కొందరు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దీనిని ప్రోపగాండా చిత్రమని ఆరోపించారు. కేరళ రాష్ట్రాన్ని తప్పుగా చూపిస్తున్నారనే అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ చిత్రబృందం నిర్ణయించిన తేదీకి విడుదల చేయడానికి సిద్ధమైంది.

ఇటీవల సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘యూ/ఏ’ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ఈ సర్టిఫికెట్‌ను సవాలు చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సినిమాలో మతపరమైన ఉద్రిక్తతలు రేకెత్తించే అంశాలు ఉన్నాయని పిటిషనర్ వాదించారు. ఈ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నప్పటికీ ఎలా ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఇచ్చారో వివరించాలని సెన్సార్ బోర్డును ప్రశ్నించింది. సినిమా కంటెంట్‌ను పునఃపరిశీలించాలని కూడా ఆదేశించింది.

మంగళవారం జరిగిన విచారణలో కోర్టు, విడుదలకు ముందు చిత్రాన్ని తన ముందు ప్రదర్శించాలని సూచించింది. సాధారణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవని, కానీ ఈ చిత్రంలో రాష్ట్రం పేరు టైటిల్‌లో ఉండటంతో ప్రజల ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని విచారణ చేపట్టినట్లు తెలిపింది. ఫిబ్రవరి 25న చిత్రాన్ని కోర్టులో ప్రదర్శించగా, పరిశీలించిన అనంతరం విడుదలపై మధ్యంతర స్టే విధించింది.

ఈ చిత్రానికి కామాఖ్యా నారాయణ్ సింగ్ దర్శకత్వం వహించగా, విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ట్రైలర్ విడుదలైన తర్వాత కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సినిమా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కూడా విమర్శలు గుప్పించారు.

అయితే ఈ ఆరోపణలను చిత్రబృందం ఖండించింది. ఎవరినీ లక్ష్యంగా చేసుకుని సినిమా తీయలేదని, సమాజంలో ఉన్న కొన్ని సంఘటనల ఆధారంగా నిర్మించామని తెలిపారు. వివాదాలు రేపడం తమ ఉద్దేశం కాదని, సినిమా చూసిన తర్వాతే అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ప్రస్తుతం కోర్టు నిర్ణయంతో విడుదల వాయిదా పడగా, తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.

Also Read: Cancer: ఈ లక్షణాలు కనిపిస్తే నెగ్లెక్ట్ చేయొద్దు!

The Kerala Story 2: ‘ది కేరళ స్టోరీ-2’ సినిమాపై స్టే