CM Vijay: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లంచాలు అడిగే అధికారులపై ఫిర్యాదు చేసే పౌరులకు భారీ నగదు బహుమతి ప్రకటిస్తూ కొత్త ప్రోత్సాహక పథకాన్ని ప్రారంభించింది.
ఈ కొత్త విధానం ప్రకారం, రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారులు లేదా సిబ్బంది రూ.1000 లంచం అడిగినా ప్రజలు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయవచ్చు. సరైన ఆధారాలతో అవినీతి అధికారులను పట్టించేందుకు సహకరించిన వారికి ప్రభుత్వం తరఫున రూ.1 లక్ష నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఫిర్యాదులు స్వీకరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉండే ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ 1800 425 1555ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నంబర్ ద్వారా ప్రజలు నేరుగా అవినీతి నిరోధక శాఖను సంప్రదించవచ్చు.
సామాన్య ప్రజలను అవినీతి వ్యతిరేక పోరాటంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పథకం వల్ల లంచగొండితనంపై గట్టి నియంత్రణ సాధించవచ్చని, పేదలకు ప్రభుత్వ సేవలు మరింత సులభంగా అందే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
