Safty Tips: తెలిసిన దారి అయినా, ఎప్పుడూ తిరిగే వీధి అయినా రాత్రి పడితే ఒక భయం కలుగుతుంది. అలాంటి సమయంలో ఎవరో ఒకరు కనిపిస్తే భరోసా కలిగినట్టుగా అనిపిస్తుంది. కానీ ఆ వ్యక్తి సహాయం చేసే వాడేనా, లేక ప్రమాదకరుడా అన్నది ముందుగా తెలియదు. ఇటీవలి ఘటనలు చూస్తే.. స్నేహితుడని నమ్మి మోసపోయిన జర్మనీ యువతి, క్యాబ్ డ్రైవర్ పేరుతో ప్రాణాలు కోల్పోయిన పుణె టీనేజర్—ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా జరగవచ్చనే విషయం గుర్తుంచుకోవాలి. అందుకే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయడం అవసరం.
రాత్రిపూట ఒంటరిగా నడవాల్సి వస్తే చీకటి దారులను పూర్తిగా నివారించాలి. వెలుతురు ఎక్కువగా ఉండే, జనసంచారం ఉండే రహదారులనే ఎంచుకోవాలి. సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలు, భద్రతా సిబ్బంది ఉన్న ప్రాంతాలు మరింత సురక్షితం. అవసరమైతే చుట్టూ ఉన్న వారితో సహాయం కోరడం మంచిది.
ఒంటరిగా బయటకు వెళ్లేటప్పుడు మీ కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు లైవ్ లొకేషన్ షేర్ చేయడం చాలా ముఖ్యం. “ఇంటికి చేరే వరకు గమనించండి” అని చెప్పాలి. సురక్షితంగా చేరుకున్న తర్వాత వారికి సమాచారం ఇవ్వడం మర్చిపోవద్దు. అత్యవసర పరిస్థితుల కోసం ఒక రహస్య కోడ్ పదం కూడా ముందుగా నిర్ణయించుకోవచ్చు. అలాగే పెప్పర్ స్ప్రే వంటి రక్షణ సాధనాలు దగ్గర ఉంచుకోవడం, ఫోన్‌లో ఎమర్జెన్సీ కాల్ సెట్టింగ్స్ పెట్టుకోవడం ఉపయోగపడుతుంది.
రాత్రి షిఫ్ట్‌లలో పనిచేసేవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. ప్రతిరోజూ ఒకే మార్గంలో ప్రయాణించకుండా మార్గాన్ని మార్చుతూ ఉండటం మంచిది. క్యాబ్ లేదా ఆటో ఎక్కే ముందు యాప్‌లో చూపిన డ్రైవర్ వివరాలు, వాహన నంబర్ సరిపోతున్నాయో లేదో తప్పనిసరిగా చెక్ చేయాలి. ‘తక్కువ డబ్బులకు తీసుకెళ్తా’ అనే మాటలకు లోబడకూడదు. ఒకసారి రైడ్ క్యాన్సిల్ చేస్తే లైవ్ ట్రాకింగ్ ఆగిపోతుంది—అది ప్రమాదకరం.
ప్రయాణం ప్రారంభించిన వెంటనే లైవ్ ట్రాకింగ్ లింక్‌ను మీ ఆత్మీయులకు పంపండి. ప్రయాణ సమయంలో ఫోన్‌లో సినిమాలు చూడడం లేదా సోషల్ మీడియాలో మునిగిపోవడం తగ్గించి, చుట్టూ జరిగేదాన్ని గమనించాలి. డ్రైవర్ మార్గం మార్చితే వెంటనే ప్రశ్నించాలి. అవసరమైతే ఫోన్‌లో మాట్లాడుతూ మీ లొకేషన్ చెబుతూ ఉండటం మంచిది. డ్రైవర్ మధ్యలో ఎవరినైనా ఎక్కించేందుకు ప్రయత్నిస్తే ఖచ్చితంగా నిరాకరించాలి.
డ్రైవర్ ప్రవర్తనలో ఏదైనా అనుమానం కలిగితే జనసంచారం ఉన్న ప్రదేశంలో వెంటనే దిగిపోవడం మంచిది. డబ్బు కంటే మీ భద్రత ముఖ్యమని గుర్తుంచుకోండి. ‘టీ సేఫ్’ వంటి భద్రతా యాప్‌లు కూడా ఉపయోగపడతాయి. ఇవి అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం చేరేలా సహాయపడతాయి.
బస్సు లేదా రైలు ప్రయాణాల్లో వీలైనంత వరకు వెలుతురు ఉన్న సమయంలో దిగడం మంచిది. తెల్లవారక ముందే దిగాల్సి వస్తే కుటుంబ సభ్యులను పిలవండి. అది సాధ్యం కాకపోతే రైల్వే స్టేషన్‌లోని వెయిటింగ్ హాల్స్ లేదా రిటైరింగ్ రూమ్స్‌లో ఉండటం సురక్షితం. హెల్ప్ డెస్క్‌ల సహాయం తీసుకోవడంలో సంకోచించవద్దు.
కొంతమంది ‘అక్క, చెల్లి’ అని ఆప్యాయంగా మాట్లాడినా, వారిని పూర్తిగా నమ్మే ముందు జాగ్రత్త అవసరం. ఎవరి ఉద్దేశం ఏంటో ముందే తెలియదు. అందుకే ముందుగానే ప్రయాణ మార్గాన్ని మ్యాప్‌లో చూసుకుని, విశ్వసనీయమైన సర్వీసులనే ఎంచుకోవాలి. వీలైతే రాత్రిపూట బస్సు లేదా షేర్ ఆటోలు ఉపయోగించడం కూడా కొంతవరకు సురక్షితం.
ఇతర చోట్ల జరిగిన ఘటనలు మనకు జరగవని అనుకోవద్దు. ప్రమాదం ఎప్పుడైనా, ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి అప్రమత్తంగా ఉండటం, ధైర్యంగా కానీ జాగ్రత్తగా వ్యవహరించడం మనకు రక్షణ.
