Manipur: మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్ బంద్ !

Manipur govt suspends internet in Ukhrul amid fresh Naga–Kuki violence

Manipur govt suspends internet in Ukhrul amid fresh Naga–Kuki violence

Manipur: మణిపూర్ రాష్ట్రంలో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. ఉఖ్రుల్ జిల్లా లిటాన్ గ్రామంలో తంగ్ఖుల్ నాగా, కుకీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. శనివారం జరిగిన చిన్న గొడవే క్రమంగా పెద్ద హింసకు దారితీసింది. ఆ రోజు జరిగిన ఘర్షణలో స్టెర్లింగ్ షిమ్రే అనే వ్యక్తి గాయపడటంతో రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగింది.

ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం జిల్లా యంత్రాంగం నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ, ఆందోళనకారులు వాటిని పట్టించుకోలేదు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు రెచ్చిపోయి ఇళ్లకు నిప్పు పెట్టడం ప్రారంభించారు. మొదట 18 ఇళ్లు కాలిపోగా, మంగళవారం నాటికి ఆ సంఖ్య సుమారు 50కి చేరిందని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి మొదలైన విధ్వంసం మంగళవారం ఉదయానికి మరింత తీవ్రమైంది. రెండు వర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది.

ఈ హింస నేపథ్యంలో ఎలాంటి వదంతులు, రెచ్చగొట్టే వార్తలు వ్యాపించకుండా ఉండేందుకు జిల్లావ్యాప్తంగా ఐదు రోజుల పాటు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ డేటా సహా అన్ని రకాల ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు. జిల్లా మేజిస్ట్రేట్ ఆశిష్ దాస్ విజ్ఞప్తి మేరకు హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

శాంతిభద్రతలను కాపాడేందుకు భారీ సంఖ్యలో భద్రతా బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి అల్లరి మూకలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, శాంతిని పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

లిటాన్ సరేఖోంగ్ ప్రాంతంలో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రాణభయంతో అక్కడి గ్రామస్తులు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృద్ధులు కంగ్పోక్పి జిల్లాలోని మోత్‌బుంగ్, సైకుల్ వంటి ప్రాంతాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవల కొన్ని నాగా సంఘాలు కుకీ ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడమూ ఈ ఘర్షణలకు ఒక కారణమని తెలుస్తోంది. రాష్ట్ర మంత్రి గోవిందాస్ కోంతౌజమ్ అదనపు బలగాలను పంపామని, పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.

Also Read: Jai Hanuman: ఆంజనేయస్వామికి తమలపాకంటే ఎందుకు ఇష్టమంటే?

Manipur: మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్ బంద్ !