Medaram Jatara: మేడారంలో భగ్గుమంటున్న చికెన్, మటన్ రేట్లు

Price Shock at Medaram Jatara | Meat & Veg Rates Double

Price Shock at Medaram Jatara | Meat & Veg Rates Double

Medaram Jatara: మేడారంలో వనదేవతల జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతోంది. ఈ మహాజాతర కోసం రాష్ట్రంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు మేడారానికి తరలివస్తున్నారు. అయితే జాతర వాతావరణానికి భిన్నంగా, అక్కడ ధరలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. భక్తుల విశ్వాసాన్ని అవకాశంగా మార్చుకుని కొందరు వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలు పెంచుతూ దోపిడీకి పాల్పడుతున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జాతర ప్రాంతంలో తినుబండారాలు, నివాస సౌకర్యాలు, మద్యం వంటి ప్రతిదానిపైనా అధిక ధరలు వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సాధారణ రోజుల్లో బయట మార్కెట్‌లో కిలో మటన్ ధర రూ.900 నుంచి రూ.1000 మధ్య ఉంటే, మేడారంలో అదే మటన్‌ను రూ.1500కు విక్రయిస్తున్నారు. అలాగే బయట రూ.170కి లభించే లైవ్ కోడిని జాతర ప్రాంతంలో రూ.350కు పైగా అమ్ముతున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

మద్యం ధరలు కూడా భక్తులకు షాక్ ఇస్తున్నాయి. సాధారణంగా రూ.180కి దొరికే బీర్‌ను మేడారంలో రూ.280 నుంచి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. ఇతర మద్యం బాటిళ్లపై కూడా కనీసం రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ అధిక ధరల కారణంగా చాలామంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక నివాస సౌకర్యాల పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది. సరైన షెడ్లు, తాత్కాలిక గదులు లేకపోవడంతో చెట్టు కింద నీడ కోసం కూడా డబ్బులు అడుగుతున్నారు. చెట్టు కింద ఉండేందుకు రూ.1000 నుంచి రూ.2000 వరకు అద్దె వసూలు చేయడం భక్తులను ఆగ్రహానికి గురి చేస్తోంది.

ఇంత పెద్ద జాతరలో ధరల నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ధరలను నియంత్రించాలని, దోపిడీని అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. భక్తి, విశ్వాసంతో జరగాల్సిన మేడారం జాతర దోపిడీకి వేదికగా మారకూడదని భక్తులంతా కోరుకుంటున్నారు.

Also Read: Chandra Grahan 2026: ఈ ఏడాదిలో తొలి చంద్రగ్రహణం ఎప్పుడంటే..

Medaram Jatara: మేడారంలో భగ్గుమంటున్న చికెన్, మటన్ రేట్లు