Crime: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మడికి శివారు చిలకలపాడులో బుధవారం తెల్లవారుజామున జరిగిన దారుణం గ్రామాన్ని కలిచివేసింది. భార్య తరఫు బంధువుల వేధింపులను తట్టుకోలేక ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సెలూన్ నడుపుతూ జీవనం సాగిస్తున్న పావులూరి కామరాజు (36) తన కుమారులు అభిరామ్ (11), త్రినాథ్ గౌతమ్ (8)లకు పురుగుమందు తాగించి, అనంతరం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
వివరాల ప్రకారం, కామరాజు భార్య నాగలక్ష్మి 2020లో కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఆ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు అప్పట్లో కేసు పెట్టగా, 2024 జూలైలో కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
ఇటీవల భార్య బంధువులైన కొలుప్రోలు తలుపులు, అతని కుమారుడు శ్రీనివాస్, అలాగే బంధువు పావులూరి దుర్గారావు తనను పదేపదే వేధిస్తున్నారని కామరాజు బాధ వ్యక్తం చేశారు. ఈ వేధింపులు భరించలేకపోయిన కామరాజు బుధవారం తెల్లవారుజామున సెల్ఫీ వీడియో తీసి తన ప్రాణాలపై దాడి చేసుకున్నారు.
ఆ వీడియోలో తాను ఎక్కడికెళ్లినా ఆ ముగ్గురు వెంటాడుతున్నారని, తన తల్లిని అవమానిస్తున్నారని, తాను చనిపోయిన తర్వాత తన పిల్లలను కూడా వారు వేధిస్తారనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
ఉదయం వీడియో చూసిన బంధువులు కామరాజు ఇంటికి వెళ్లగా, అప్పటికే తండ్రి–పిల్లలు ముగ్గురూ మృతులై కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
