Bihar: ముస్లిం వివాహాల్లో రాముడి పాటలు, సింధూరం

Songs Of Dashrath And Ram Are Sung In Muslim Weddings Of Piru And Bantara Villages Of Bihar

Songs Of Dashrath And Ram Are Sung In Muslim Weddings Of Piru And Bantara Villages Of Bihar

Bihar: మన దేశంలో మత సామరస్యానికి ఉదాహరణగా నిలిచే అనేక చారిత్రాత్మక సంఘటనలు ఉన్నాయి. అందులో బిహార్‌లోని గయా–ఔరంగాబాద్ సరిహద్దులో ఉన్న పీరు, బంతారా అనే రెండు గ్రామాల చరిత్ర మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ రెండు గ్రామాల్లో వేలాది ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, వారి ఇంటి శుభకార్యాలు మాత్రం ఇప్పటికీ హిందూ సంప్రదాయాల ప్రకారమే జరుగుతాయి. మసీదులో నికాహ్ జరిగిన తరువాత, ఇంటి వద్ద పెళ్లి ఆచారాలు హిందూ పద్ధతుల్లో కొనసాగుతాయి. వధువు నుదుట సింధూరం పెట్టడం, పెళ్లి పందిరి కింద నాగలితో భూమి దున్నడం వంటి ఆచారాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తరతరాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాల వెనుక ఉన్న కారణం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది.

రాముడి కీర్తనలతో మార్మోగే పెళ్లిళ్లు

ఈ గ్రామాల్లో వివాహాలు ప్రారంభమయ్యాయంటే చాలు, ఇంటి ప్రాంగణం శ్రీరాముడి కీర్తనలతో మార్మోగిపోతుంది. పెళ్లి ముందు జరిగే హల్దీ వేడుకలో మహిళలు గుమిగూడి జానపద గీతాలను ఆలపిస్తారు. పెళ్లి పందిరి (మడ్వా) వేయడం, నాగలిని నడపడం, వధువు చెవుల్లో కాటుక, నుదుట సింధూరం వంటి హిందూ పెళ్లిల్లో కనిపించే ఆచారాలు ఇక్కడ కూడా తప్పకుండా పాటిస్తారు.

తుగ్లక్ పాలనలో జరిగిన మార్పు – మారని వారసత్వం

ఈ ఆచారాలకు సుమారు 600–700 ఏళ్ల చరిత్ర ఉంది. 14వ శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ పాలన సమయంలో పీరు ప్రాంతానికి చెందిన భూమిహార్ జమీందార్ మథురా చౌదరి ఇస్లాం స్వీకరించారు. ఆయన పేరు తరువాత గులాం ముస్తాఫా ఖాన్‌గా మారింది. ఆయనతో పాటు కుటుంబంలోని మరికొంత మంది ముస్లింలుగా మారినా… వారసత్వంగా వచ్చిన హిందూ సంప్రదాయాలను వదల్లేదు. అందుకే ఈరోజూ కూడా తమను తాము హిందూ భూమిహార్ వంశస్థులమనే గుర్తింపును గౌరవంగా స్వీకరిస్తున్నారు.

DNAలో హిందూత్వం ఉన్నదని పుస్తకంలో రికార్డ్

ఈ విషయంపై ప్రముఖ పండితుడు అమనుల్లా ఖాన్ రాసిన ‘పీరు ఏక్ పరిచయ్’ పుస్తకంలో కూడా స్పష్టమైన వివరాలు ఉన్నాయి. ఆయన ప్రకారం పీరు గ్రామ ముస్లింల పూర్వీకులు హిందువులే కావడంతో, వారి రక్తసంబంధాలు కూడా హిందూ భూమిహార్ వంశానికి చెందినవేనని పేర్కొన్నారు. ఆయన కుమార్తె జీనత్ పర్వీన్ కూడా “మేము హోలీ, దసరా పండుగల్లో పాల్గొంటాం. పెళ్లిళ్లలో వధువు బుట్టలో పాదాలు పెట్టి ఇంటికి ప్రవేశించే ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది” అని తెలిపారు.

బంతారా గ్రామంలో కూడా ఇదే సంప్రదాయం

పీరు గ్రామం లాగే బంతారాలోనూ 500కు పైగా ముస్లిం ఇళ్లు ఉన్నాయి. వీరు తమను తాము ‘సోనభద్రి భూమిహార్’ వంశస్థులమని చెప్పుకుంటారు. కేయల్ గఢ్ రాజు తిలక్ చౌదరి ఇస్లాం స్వీకరించిన తర్వాత ఈ వంశం కొనసాగింది. ఇప్పటికీ వీరు తమ మతంలోకి మారిన ఇతర హిందూ వంశాలతోనే సంబంధాలు కలుపుకొంటున్నారు. ఇటీవల డిసెంబర్ 28న జరిగిన పెళ్లిలో కూడా రాముడి పాటలు, మడ్వా ఆచారాలు పాటించినట్లు స్థానికులు చెబుతున్నారు.

వివక్ష కాదు, సంస్కృతికి గౌరవం

ఈ రెండు గ్రామాల్లో హిందూ–ముస్లిం మధ్య ఎలాంటి వివక్ష కనిపించదు. మతాలకు అతీతంగా మానవ సంబంధాలు, సంప్రదాయాలు మరియు వారసత్వాన్ని గౌరవించే ఆచారం తరతరాలకు అందుతున్నది. ముస్లింలు తమ హిందూ మూలాలను గౌరవిస్తూ పెళ్లిళ్లలో ఆచారాలను కొనసాగించడం భారతీయ సంస్కృతి ఎంత వైవిధ్యంగా ఉందో మరోసారి నిరూపిస్తుంది.

Also Read: Gold Prices: రోజుకో షాక్.. తులం బంగారం ఎంతుందంటే..

Bihar: ముస్లిం వివాహాల్లో రాముడి పాటలు, సింధూరం