Konda Surekha: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగార్జున కుటుంబంపై గతంలో చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల నాగార్జున గారికి లేదా వారి కుటుంబ సభ్యులకు ఏమైనా మనస్తాపం కలిగితే, దానిపై తాను చింతిస్తున్నానని ఆమె బహిరంగంగా తెలిపారు. సోషల్ మీడియా ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆ ప్రకటనలో కొండా సురేఖ ఇలా పేర్కొన్నారు: “నాగార్జున గారి గురించి నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే దానికి నేను చింతిస్తున్నాను. ఆయనను లేదా వారి కుటుంబ సభ్యులను కించపరచాలన్న ఉద్దేశం నాకు లేదు. నా మాటల వల్ల ఏదైనా అపార్థం కలిగితే వాటిని ఉపసంహరించుకుంటున్నాను” అని తెలిపారు.
I would wish to clarify that the statement I had made in relation to @iamnagarjuna Garu was not intended to hurt Nagarjuna Garu or his family members.
I had no intention of hurting or defaming Akkineni Nagarjuna Garu or his family members.
I regret any unintended impression…
— Konda Surekha (@iamkondasurekha) November 11, 2025
గమనించదగిన విషయం ఏమిటంటే, గతంలో కొండా సురేఖ అక్కినేని నాగచైతన్య–సమంత విడాకులకు కేటీఆర్ కారణమని వ్యాఖ్యానించారు. ఆ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. దీనిపై స్పందించిన నాగార్జున, కేటీఆర్ వేర్వేరుగా కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. అలాగే, ఆ వ్యాఖ్యలను ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెల్లు, వెబ్‌సైట్లు మరియు వ్యక్తులపైనా కేసులు దాఖలు చేశారు.
ఆ కేసుల విచారణ సందర్భంగా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి, నాగార్జున కుటుంబ పరువుకు భంగం కలిగించేలా ఎవరూ వ్యాఖ్యలు చేయరాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఈ అంశంపై మాట్లాడకూడదని కూడా ఆదేశించింది. ఈ సమయంలోనే నాగార్జున నుంచి కూడా ఒక అధికారిక ప్రకటన తీసుకుంది.
తర్వాత కొండా సురేఖకు కోర్టు సమన్లు జారీ చేయగా, ఆమె తరపున న్యాయవాది ఆమె ఇప్పటికే క్షమాపణలు చెప్పినట్లు తెలిపాడు. ఈ సంఘటన గత ఏడాది డిసెంబర్‌లో జరిగింది. ప్రస్తుతం పరువు నష్టం దావా విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది.
