Jubilee hills By-Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నామినేషన్లకు నేడే లాస్ట్

Jubilee Hills by-election nominations deadline ends today

Jubilee Hills by-election nominations deadline ends today

Jubilee hills By-Poll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాయి. రానున్న స్థానిక సంస్థలు, బల్దియా ఎన్నికలకు ఇది మార్గదర్శకంగా ఉండబోతుండటంతో, ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.

నవంబర్‌ 11న జరగనున్న ఈ ఉపఎన్నికలో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. నేడు నామినేషన్‌ దాఖలు చివరి రోజు కావడంతో, రిటర్నింగ్‌ అధికారికి భారీ సంఖ్యలో నామినేషన్లు అందుతున్నాయి. అక్టోబర్‌ 13న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియలో ఇప్పటివరకు మొత్తం 94 మంది తమ నామినేషన్‌ పత్రాలను సమర్పించారు.

చివరి రోజున మరింత సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించనున్నట్లు అంచనా. ఈసారి జూబ్లీహిల్స్‌లో వందకు పైగా నామినేషన్లు దాఖలు కానున్నాయని అధికారులు తెలిపారు. షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులు కఠిన భద్రతా ఏర్పాట్లు చేశారు.

కాంగ్రెస్‌ ప్రణాళికలు:

నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే సీఎం రేవంత్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, సీనియర్‌ నేతలు జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొననున్నారు.

అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ గెలిస్తే నియోజకవర్గం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. రోడ్లు, తాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో లక్షకు పైగా మెజారిటీతో నవీన్‌ యాదవ్‌ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన గెలిస్తే నియోజకవర్గ అభివృద్ధిలో పెద్ద మార్పు వస్తుందని పేర్కొన్నారు.

బీజేపీ సన్నాహాలు:

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తోంది. పార్టీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి తరపున ఇప్పటికే ఆయన భార్య ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఇవాళ దీపక్‌రెడ్డి స్వయంగా అట్టహాసంగా నామపత్రం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు హాజరవుతున్నారు.

అభ్యర్థి తరపున ప్రచారం చేయడానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. అందులో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ తదితర జాతీయ, రాష్ట్ర నాయకులు ఉన్నారు. కిషన్‌రెడ్డి స్వయంగా డివిజన్‌, బూత్‌ అధ్యక్షులతో సమావేశాలు నిర్వహిస్తూ ప్రచార వ్యూహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ వ్యూహం:

సిట్టింగ్‌ స్థానాన్ని ఏ విధంగానైనా కాపాడుకోవాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ప్రచారానికి సమాధానంగా సామాజిక మాధ్యమాల్లో బలమైన ప్రచారం ప్రారంభించింది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి కీలక నేతలు కూడా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేందుకు ప్రచార రంగంలోకి దిగనున్నారు.

Also Read: Heavy Rains: మళ్లీ వచ్చేస్తున్నాయ్… మరోసారి తెలుగు రాష్ట్రాలను కుదిపేయనున్న భారీ వర్షాలు

Jubilee hills By-Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. నామినేషన్లకు నేడే లాస్ట్