Telangana: తెలంగాణలో చలిపులి విరుచుకుపడుతోంది. చలి తీవ్రత రోజురోజుకు పెరిగిపోతూ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తోంది. రాబోయే 48 గంటల్లో చలిగాలులు మరింత బలంగా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం రాత్రి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో అత్యల్పంగా 7.4 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.1 డిగ్రీలు రికార్డయ్యాయి. ఉత్తర, పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఉన్న చలి కంటే ఈసారి మరింత కఠినంగా ఉంటుందని వారు హెచ్చరించారు.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కూడా చలి తీవ్రత గణనీయంగా పెరిగింది. ఆదివారం ఉదయం హెచ్‌సీయూ సమీపంలోని శేరిలింగంపల్లి ప్రాంతంలో 10 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాబోయే రెండు రోజుల్లో నగరంలో రాత్రిపూట 7 నుండి 11 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. శివారు ప్రాంతాలు, చెట్లతో కూడిన ప్రదేశాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
10 జిల్లాల్లో అత్యంత చలి – ఆరెంజ్ అలర్ట్
తీవ్రమైన చలి కారణంగా, వచ్చే రెండురోజులకు వాతావరణ కేంద్రం పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్, నిర్మల్, భూపాలపల్లి, మంచిర్యాల, వరంగల్, ములుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో చలి సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు సూచించారు.
వృద్ధులు, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలతో ఉన్నవారు తప్పనిసరిగా వెచ్చని దుస్తులు ధరించాలని, ముఖ్యంగా రాత్రిపూట మరియు తెల్లవారుజామున ప్రయాణాలను వీలైతే తగ్గించుకోవాలని అధికారులు సూచించారు.
