Trump: ఒకటి తర్వాత ఒకటి తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయాలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల అంతర్జాతీయ స్థాయిలో గందరగోళం నెలకొంది. ఇటీవల ఇరాన్‌పై దృష్టి పెట్టిన ట్రంప్, ఇప్పుడు యూరోప్‌లోని గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాకు ఇవ్వాలని సూచించడమే ప్రపంచానికి కొత్త షాక్‌గా మారింది. ట్రంప్ ఈ విధానం ప్రపంచ స్టాక్ మార్కెట్ల సెంటిమెంట్‌ను తీవ్రమైనంగా దెబ్బతీసింది. పెట్టుబడిదారులు అమ్మకాలకు దిగడంతో ప్రధానంగా పలు దేశాల మార్కెట్లు కుదేలయ్యాయి. ఈ పరిణామాల్లో అమెరికా స్టాక్ మార్కెట్ కూడా నెగటివ్‌గా స్పందించడం గమనార్హం. ఈ పరిస్థితులను చూస్తే ట్రంప్ ప్రపంచానికి ఒక పెద్ద ముప్పుగా మారాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ తాజా నిర్ణయాల ప్రభావంతో భారత స్టాక్ మార్కెట్ కూడా మంగళవారం (జనవరి 20) భారీ పతనాన్ని నమోదు చేసింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ కూడా పడిపోయింది. సెన్సెక్స్ 1,066 పాయింట్లు, నిఫ్టీ 353 పాయింట్లు కోల్పోయాయి. ఇది గత మూడు నెలల్లో అత్యల్ప ముగింపుగా నమోదైంది. ఒక్క రోజులోనే సుమారు రూ.10 లక్షల కోట్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.465 లక్షల కోట్ల నుంచి రూ.455 లక్షల కోట్లకు పడిపోయింది.
ట్రంప్ తరచూ సుంకాల విషయంలో ఇచ్చే షాకులు ప్రపంచ మార్కెట్లను అస్థిరం చేస్తున్నాయి. గ్రీన్‌ల్యాండ్ అంశంతో యూరోపియన్ దేశాలపై 10 నుంచి 25 శాతం వరకు సుంకాలు విధిస్తామని ఆయన హెచ్చరించడంతో మరింత ఒత్తిడి పెరిగింది. ఫలితంగా పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తులైన బంగారం, వెండికి మొగ్గుచూపారు. అందువల్ల బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరగా, వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి.
ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత ‘అమెరికా ఫస్ట్’ విధానాన్ని మరింత బలంగా అమలు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నాయి. జనవరి 20 నాటికి దాదాపు ప్రధాన సూచీలు 1% నుండి 2.4% వరకు నష్టపోయాయి. ట్రంప్ నిర్ణయాలతో అమెరికా మార్కెట్లు కూడా పడిపోయాయి. నాస్‌డాక్ 2.39%, ఎస్&పీ 500 2.06%, డౌ జోన్స్ 1.76% నష్టపోయాయి. ఇది గత అక్టోబర్ తర్వాత మార్కెట్లకు అత్యంత చెడ్డ రోజు అని పేర్కొన్నారు.
యూరోపియన్ మార్కెట్లు కూడా ఎర్రగీతలను చూపించాయి. జర్మనీ 1.03%, ఫ్రాన్స్ 1.78%, యూకే 0.67% నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ 225 1.11% పడిపోయింది. ఆశ్చర్యకరంగా చైనా మార్కెట్లు మాత్రం లాభపడ్డాయి. దీనికి చైనా ప్రభుత్వం తీసుకున్న తక్షణ ఉపశమన చర్యలే కారణమని విశ్లేషకులు అంటున్నారు.
ఇదే సమయంలో బంగారం ధరలు భారీగా పెరిగి, భారతీయ రూపాయి డాలర్‌తో పోలిస్తే ఆల్ టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. జనవరి 20 నాటికి రూపాయి విలువ రూ.90.97 వద్ద నమోదైంది.
