Spain: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

21 confirmed dead, 30 seriously injured after high-speed train collision in Spain

21 confirmed dead, 30 seriously injured after high-speed train collision in Spain

Spain: స్పెయిన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాదం కలకలం రేపింది. ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు రైళ్లు రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మాలాగా నుండి రాజధాని మాడ్రిడ్‌కు వెళ్తున్న హైస్పీడ్ రైలు పట్టాలు తప్పి ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొట్టింది. ఈ భయంకర ఘటనలో ఇప్పటివరకు 21 మంది మృతిచెందగా, 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించగా, ఘటనాస్థలిలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి ప్రమాదం జరగడం వల్ల సహాయక చర్యల్లో అంతరాయాలు ఏర్పడ్డాయని అధికారులు వెల్లడించారు.

ఈ ప్రమాదం ఆదివారం అర్థరాత్రి కర్డోబా రాష్ట్రంలో జరిగినట్లు రైటర్స్ పేర్కొంది. ఒక రైలు పట్టాలు తప్పి మరో రైలువైపు నేరుగా వెళ్లడం వల్లే ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. గాయపడిన వారిలో 30 మంది ప్రాణాంతక స్థితిలో ఉన్నట్లు సమాచారం. మాలాగా నుంచి బయలుదేరిన రైలులో 300 మంది ప్రయాణికులు ఉన్నారని రైలు ఆపరేటర్ వెల్లడించాడు. ప్రమాదం సమయంలో రైల్లో ఉన్న చాలా మంది లోపలే ఇరుక్కుపోయారు. వారిని బయటకు తీసేందుకు రక్షణ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ప్రమాద సమయంలో రైలు బోగీలు మెలికలు తిరిగి పట్టాలు తప్పినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది లోపల ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీయడం కష్టంగా మారిందని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఈ ఘటనలో బయటపడ్డ ప్రయాణికులు తమ అనుభవాన్ని వివరించారు. “ఒక్కసారిగా రైలు గట్టిగా కదిలింది, సూట్‌కేసులు కిందపడ్డాయి, పిల్లలు ఏడ్చారు, పక్కనే ఉన్నవారి తల పగిలి రక్తం కారడం చూశాం… ఇది పునర్జన్మలాంటి అనుభవం” అని ఒక మహిళ తెలిపింది. మరో ప్రయాణికుడు “వెనుక నుంచి ఏదో భారీగా తాకినట్టుంది, రైలు రెండు ముక్కలైందనిపించింది, అద్దాలు విరిగి చాలామంది గాయపడ్డారు” అని చెప్పాడు.

మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, కర్డోబా, మాలాగా, హూయెల్వా రైల్వే స్టేషన్లలో హెల్ప్‌లైన్‌లు ఏర్పాటు చేశారు. అత్యవసర సైనిక విభాగానికి చెందిన 40 మంది సిబ్బంది మరియు 15 వాహనాలను వెంటనే ఘటనా స్థలికి పంపినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ ఈ ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, “ఇది దేశానికి చాలా బాధాకరమైన రోజు. మాటలు వారి బాధను తగ్గించలేవు కానీ ఈ కఠిన సమయంలో దేశం మొత్తం బాధిత కుటుంబాల పక్షాన ఉంది” అని పేర్కొన్నారు.

అలాగే స్పెయిన్ రాజు ఫిలిప్ VI కూడా ఘటనపై ఆరా తీసి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యువెల్ మాక్రోన్ కూడా సానుభూతి ప్రకటించారు. స్పెయిన్‌ యూరప్‌లో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ కలిగిన దేశాల్లో ఒకటి. మాడ్రిడ్, బార్సిలోనా, సెవిల్లా, వాలెన్సియా, మాలాగా వంటి ప్రధాన నగరాలను కలుపుతూ దాదాపు 3000 కిలోమీటర్ల కంటే ఎక్కువ హైస్పీడ్ ట్రాక్ నిర్వహణలో ఉంది. ఇలాంటి ప్రమాదం జరగడం అరుదేనని అధికారులు అంటున్నారు. 2013లో శాంటియాగో డీ కంపోస్టెలా వద్ద జరిగిన హైస్పీడ్ రైలు ప్రమాదంలో 80 మంది మరణించగా, 140 మందికి పైగా గాయపడ్డారు.

Also Read: Puspa 3: పుష్ప-3 ఉంటుందా? ఉత్తి హైపేనా?

Spain: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం