Viral: మహారాష్ట్రలోని జల్గావ్ పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. కేవలం తులం బంగారం కోసం దొంగలు మానవత్వాన్ని మరచిపోయి ఘోరానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, ఛాబాబాయి కాశీనాథ్ పాటిల్ అనే వృద్ధురాలు ఈ నెల 5వ తేదీన మృతిచెందారు. ఆమె అంత్యక్రియలు సోమవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. ఆమె చివరి కోరిక ప్రకారం, శవదహన సమయంలో ఒంటిపై ధరించిన తులం బంగారాన్ని అలాగే ఉంచారు.
అయితే మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు ఆమె అస్థికలను సేకరించేందుకు అంత్యక్రియ స్థలానికి చేరుకోగా, అక్కడ చూసిన దృశ్యంతో షాక్‌కు గురయ్యారు. అక్కడ వృద్ధురాలి కపాలం, ఎముకలు కనిపించలేదు. విచారంతో వెతికిన వారు చివరికి బంగారం కోసం దొంగలు ఆమె అస్థికలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు.
ఈ సంఘటన పట్టణంలో పెద్ద సంచలనం సృష్టించింది. మరణించిన వ్యక్తి అస్థికలను కూడా దొంగలు వదల్లేదనే ఆలోచన అందరినీ కలచివేసింది. భద్రతా ఏర్పాట్లలో మున్సిపాలిటీ నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. అంత్యక్రియ స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రివేళ పహారా వ్యవస్థ లేకపోవడమే ఇలాంటి దుర్ఘటనలకు కారణమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
