Viral: ఇప్పటి కాలంలో ప్రతిదీ డిజిటల్ అయిపోయింది. గతంలో వ్యక్తిగతంగా చేయాల్సిన పనులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేయగలుగుతున్నాం. విద్యార్థులు ఆన్‌లైన్‌లో క్లాసులు అటెండ్ అవుతున్నా, న్యాయవాదులు కోర్టు విచారణలకు వర్చువల్‌గా హాజరవుతున్నా – టెక్నాలజీ అందించిన ఈ సౌకర్యం జీవనశైలిని పూర్తిగా మార్చేసింది.
తప్పనిసరి పరిస్థితుల్లో కోర్టులు కూడా ఆన్‌లైన్ హాజరును అనుమతిస్తున్నాయి. అయితే ఈ సౌకర్యాన్ని దుర్వినియోగం చేసిన ఘటన ఒకటి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటనలో, కోర్టు విచారణ కోసం ఆన్‌లైన్‌లో హాజరైన ఓ న్యాయవాది తన పక్కన ఉన్న మహిళను ల్యాప్‌టాప్ కెమెరా ముందు ముద్దు పెట్టుకోవడం పెద్ద దుమారాన్ని రేపింది.
వివరాల ప్రకారం, ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు విచారణ ఆన్‌లైన్‌లో కొనసాగుతుండగా, న్యాయమూర్తి రాకముందు అందరూ వేచి ఉన్నారు. ఆ సమయంలో ఒక న్యాయవాది కెమెరా ముందు కనిపించాడు. కొద్దిసేపటికే అతను తన పక్కన ఉన్న మహిళను పిలిచి ముద్దు పెట్టుకున్నాడు. ఆ దృశ్యం వీడియోలో రికార్డ్ అవ్వడంతో, అది ఇంటర్నెట్‌లో వేగంగా వైరల్ అయింది.
ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నెటిజన్లు ఆ న్యాయవాది ప్రవర్తనను తీవ్రంగా విమర్శిస్తున్నారు. “కోర్టు వంటి గంభీరమైన వేదికను ఇలా అవమానించడం సరికాదు” అంటూ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ టెక్నాలజీ సౌకర్యం అందించినా, దాన్ని సద్వినియోగం చేయడం మన బాధ్యత అనే విషయం ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.
