Viral: ఉత్తరప్రదేశ్‌లో ఒక విషాదకరమైన, ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. కన్నౌజ్ జిల్లాలో బుధవారం (ఫిబ్రవరి 11) జరిగిన ఈ సంఘటనలో, తాను ప్రేమించిన అమ్మాయిని వివాహం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ 18 ఏళ్ల యువకుడు ఏకంగా 100 అడుగుల ఎత్తున్న మొబైల్ టవర్‌పైకి ఎక్కాడు. చివరకు ఆ టవర్ నుంచి కిందపడటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు.
సమాచారం ప్రకారం, యువకుడు టవర్‌పైకి ఎక్కి దాదాపు రెండు గంటల పాటు అక్కడే ఉండిపోయాడు. తాను ప్రేమించిన యువతిని తనకు వివాహం చేయాలని కోరుతూ, ఆమె పేరును పదే పదే అరిచాడు. “నన్ను ఆమెకు పెళ్లి చేయాలి, లేదంటే ఇక్కడి నుంచే దూకి చనిపోతాను” అంటూ తీవ్ర హెచ్చరికలు చేశాడు. వివాహంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుంటేనే తాను కిందకు దిగుతానని మొండిగా చెప్పాడు.
ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకుని, అతడిని శాంతింపజేసి కిందకు దిగమని వేడుకున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు కూడా గ్రామానికి చేరుకుని అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయితే యువకుడు ఎవరి మాట వినకుండా టవర్‌పైనే నిలబడి తన డిమాండ్‌ను కొనసాగించాడు. చివరికి అదుపు తప్పి టవర్ నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే సమీపంలోని సిహెచ్‌సీకి తరలిస్తుండగా, మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు.
మృతుడిని పురభోజ్ గ్రామానికి చెందిన సుమిత్ రాజ్‌పుత్ (18)గా పోలీసులు గుర్తించారు. రాజస్థాన్‌లోని ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సుమిత్, 15 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అతడు తన బంధువుల అమ్మాయిపై వన్‌సైడ్ ప్రేమ పెంచుకున్నాడు. అయితే ఆమె కుటుంబం ఈ వివాహ ప్రతిపాదనను తిరస్కరించింది. ఆ యువతి అతడిని ప్రేమించకపోవడమే కాకుండా, మూడు రోజుల క్రితమే మరో వ్యక్తిని వివాహం చేసుకుంది.
సుమిత్ తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందడంతో, వితంతువు తల్లి, మానసికంగా బలహీనమైన తమ్ముడు అతనిపై ఆధారపడి జీవిస్తున్నారు. అతని చెల్లికి ఇప్పటికే ఐదేళ్ల క్రితమే పెళ్లి జరిగింది. కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న సుమిత్ మృతి చెందడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
“मेरी शादी करा दो, नहीं तो कूद जाऊंगा और मर जाऊंगा”
एक युवक प्रेमिका से शादी कराने की जिद में टावर पर चढ़ा हुआ था. नीचे लोग उसे टावर से उतरने की मिन्नतें कर रहे थे.
तभी युवक का बैलेंस बिगड़ा और 100 फीट ऊंचे मोबाइल टावर से नीचे आ गिरा और मौत हो गई. घटना यूपी के कन्नोज की है. pic.twitter.com/5FtCWnyLy1
— Priya singh (@priyarajputlive) February 11, 2026
