Telangana: కుటుంబ విభేదాల కారణంగా ఓ వివాహిత తన చిన్న కుమార్తెతో కలిసి ప్రాణాలు తీసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాతబస్తీలో నివాసం ఉండే వ్యాపారి పృథ్విలాల్ కు భార్య కీర్తిక అగర్వాల్ (28) చార్టెడ్ అకౌంటెంట్‌గా పనిచేస్తోంది. ఈ దంపతులకు బియ్యారా అనే రెండేళ్ల చిన్నారి ఉంది.
దంపతుల మధ్య తరచూ జరిగే తగాదాల కారణంగా, కీర్తిక ఏడాదిన్నర క్రితం కుమార్తెతో కలిసి బహదూర్పురలోని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అక్కడే ఉంటోంది. అయితే నవంబర్ 2న కీర్తిక, తన కుమార్తెతో కలిసి హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
సోమవారం నెక్లెస్ రోడ్‌లోని నీరా కేఫ్ ప్రాంతం వద్ద ఒక మహిళ మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం మేరకు మార్చురీకి తరలించి విచారణ ప్రారంభించారు. ఇదే సమయంలో తన కుమార్తె, మనుమరాలు కనిపించడం లేదంటూ కీర్తిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు అయ్యింది.
దర్యాప్తులో ఆ మృతదేహం కీర్తిక అగర్వాల్‌దేనని గుర్తించిన పోలీసులు, ఆమె కుమార్తె కూడా నీటిలో మునిగి ఉండవచ్చని అనుమానించారు. అనంతరం జరిగిన శోధనలో మంగళవారం చిన్నారి బియ్యారా మృతదేహం కూడా బయట పడింది.
