Investment Summit: పెట్టుబడుల పండగకు సిద్ధమైన విశాఖ

Visakhapatnam set to host 30th CII Partnership Summit

Visakhapatnam set to host 30th CII Partnership Summit

Investment Summit: రాష్ట్రంలో పెట్టుబడుల పండగకు ఇక కొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరగనున్న ఈ భారీ భాగస్వామ్య సదస్సు కోసం మొత్తం ప్రాంగణాన్ని ఆకర్షణీయంగా అలంకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం తిరిగి చురుకుగా మారింది. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని విడిచిపోయిన అనేక కంపెనీలు మళ్లీ ఏపీపై దృష్టి పెట్టడం ప్రారంభించాయి. గూగుల్ లాంటి అంతర్జాతీయ సంస్థ డేటా సెంటర్ కోసం భారీ పెట్టుబడులతో ముందుకు రావడం కీలక మలుపుగా నిలిచింది.

గత ఏడాదిన్నర కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దేశం-విదేశాల్లో పర్యటిస్తూ సాగించిన పెట్టుబడుల వేట ఫలితంగా ‘బ్రాండ్ ఏపీ’ మళ్లీ ప్రతిష్ఠను అందుకుంది. ఈ నేపధ్యంలో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పెట్టుబడిదారుల భాగస్వామ్య సదస్సును భారీ స్థాయిలో నిర్వహిస్తోంది.

సదస్సుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

సీఐఐ, ఏపీ ప్రభుత్వం కలిసి ఏర్పాట్లు చేసిన ఈ రెండు రోజుల సదస్సు శుక్రవారం ఉదయం ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతులమీదుగా ప్రారంభం కానుంది. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అలాగే కేంద్ర–రాష్ట్ర మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సీఐఐ ప్రతినిధులు పాల్గొననున్నారు.

మొత్తం ఎనిమిది హాళ్లను సిద్ధం చేశారు. హాల్ నంబర్–5 ప్రధాన వేదికగా ఉండగా, మిగతా హాళ్లలో వేరువేరు గోష్ఠులు, సదస్సులు జరగనున్నాయి. సీఎం, కేంద్ర మంత్రుల కోసం ప్రత్యేక చాంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మొదటి రోజు రాత్రి 8 గంటల వరకు ప్లీనరీ సెషన్లు కొనసాగుతాయి. రెండో రోజు ఉదయం 9.30కు మళ్లీ సెషన్లు మొదలై, సాయంత్రం 5 నుంచి 5.45 వరకు ముగింపు కార్యక్రమం ఉంటుంది. మొత్తం 35 దేశాల నుండి మంత్రులు, ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

ప్రారంభోత్సవ వేదికపై 21 మంది విశిష్ట అతిథులు

ప్రధాన వేదిక ముందు వరుసలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, గవర్నర్ నజీర్, సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నాదెండ్ల మనోహర్, సీఐఐ అధ్యక్షుడు రాజేంద్ర మోమాని, ఉపాధ్యక్షురాలు సుచిత్ర ఎల్లా, డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంధి మల్లికార్జునరావు తదితరులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు.

ముందుగానే ప్రారంభమైన పెట్టుబడుల సందడి

సదస్సు ప్రారంభానికి ముందుగానే విశాఖలో పెట్టుబడి ఒప్పందాలు కుదిరాయి. గురువారం నోవాటెల్ హోటల్‌లో సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమల శాఖ 9, ఐటీ–ఎలక్ట్రానిక్స్ శాఖ 3, ఇంధన శాఖ 6, సీఆర్‌డీఏ 8 ఒప్పందాలు చేసుకున్నాయి. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరో 4 ఒప్పందాలు కుదిరాయి.

శుక్రవారం సాయంత్రం ప్రధాన వేదిక వద్ద పరిశ్రమల శాఖ 14, ఐటీ–ఎలక్ట్రానిక్స్ 15, ఫుడ్ ప్రాసెసింగ్ 6, ఇంధన శాఖ 21 ఒప్పందాలను సంతకం చేయనున్నారు. ఈ మొత్తం ఒప్పందాల విలువ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులుగా ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

Also Read: Jubilee Hills By Election: జూబ్లీ’హిల్స్’ కౌంటింగ్, ఫలితంపై ఉత్కంఠ

Investment Summit: పెట్టుబడుల పండగకు సిద్ధమైన విశాఖ