Accident : యమునా ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ఘోర ప్రమాదంలో ఐదుగురు మరణించారు, 18 మంది గాయపడ్డారు. సమాచారం ప్రకారం, ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని తప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. తెల్లవారుజామున ఢిల్లీ నుంచి అజంగఢ్ వెళ్తున్న ప్రైవేట్ బస్సు ట్రక్కును ఢీకొట్టింది.
ఘటన అనంతరం స్థానిక అధికారులు క్షతగాత్రులను వైద్యసేవల నిమిత్తం జేవార్‌లోని కైలాష్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
దాద్రీలో ప్రమాదం
అంతకుముందు నవంబర్ 15 న, ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. ఇందులో ఒక ట్రాక్టర్ మోటార్‌సైకిల్‌ను ఢీకొట్టింది, ఫలితంగా ఒక మహిళ మరణించింది. ఈ ప్రమాదంలో ఆమె భర్త, చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘజియాబాద్‌కు చెందిన వినోద్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య పూజ, కుమారుడు బిల్లుతో కలిసి మోటార్‌సైకిల్‌పై అలీగఢ్‌కు వెళుతుండగా కోట సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. వీరి ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ పూజ మృతి చెందగా, వినోద్, బిల్లులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు దాద్రీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ సుజిత్ ఉపాధ్యాయ్ తెలిపారు.