Hyderabad: రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి భయానక ఘటన చోటుచేసుకుంది. శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్ తీగలు తగలడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు.
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం రాత్రి ఊరేగింపు జరుపుకుంటున్నారు. రథాన్ని లాగుతూ వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో దాన్ని పక్కన నిలిపి, యువకులు స్వయంగా చేతులతో రథాన్ని ముందుకు కదిలించారు. ఈ క్రమంలో రథం విద్యుత్ తీగలకు తగిలింది. ఒక్కసారిగా భారీ షాక్ తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మంది నేలపై పడిపోయారు.
ఈ దృశ్యం చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఐదుగురు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మరో నలుగురిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.
మృతులుగా గుర్తించిన వారు –
-
కృష్ణ యాదవ్ (21)
-
సురేశ్ యాదవ్ (34)
-
శ్రీకాంత్ రెడ్డి (35)
-
రుద్ర వికాస్ (39)
-
రాజేంద్ర రెడ్డి (45)
వారి మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్‌మన్ శ్రీనివాస్ కూడా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో గోకులేనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
