Dussehra: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భారీగా జరుపుకునే పండుగల్లో బతుకమ్మ, దసరా ముఖ్యమైనవి. ఈ వేడుకలకు ఇంకో పది రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ ఉత్సాహం మొదలైంది. ముఖ్యంగా విద్యార్థులు మాత్రం దసరా పండగ అంటే వెంటనే గుర్తుకు తెచ్చుకునేది సెలవులే. ఎందుకంటే ఈ సమయంలో స్కూల్‌కి వెళ్లే పనిలేకుండా, స్నేహితులతో కలిసి ఆటపాటలతో గడపొచ్చు, కుటుంబంతో ట్రిప్స్ కి వెళ్లొచ్చు అన్న ఆలోచనలో ఉంటారు.
ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించింది. అధికారిక ప్రకటన ప్రకారం, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు కలిపి 13 రోజుల సెలవులు ఇవ్వబడుతున్నాయి. ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయి. అంటే విద్యార్థులు దాదాపు రెండు వారాల పాటు చదువుల బరువు లేకుండా ఆనందంగా గడిపే అవకాశం ఉంది.
ఇక జూనియర్ కాలేజీలకు సంబంధించిన దసరా సెలవులు కొంచెం భిన్నంగా ఉన్నాయి. ఈ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది.
దసరా పండుగ సమయంలో విద్యార్థులు మాత్రమే కాకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కూడా విశ్రాంతి తీసుకునే అవకాశం దొరుకుతుంది. మరోవైపు, బతుకమ్మ పండుగ రోజుల్లో సాంప్రదాయ వేడుకలు, పూజలు, ఊరేగింపులు ఉత్సాహంగా జరగనున్నాయి.
ఈసారి తెలంగాణలో దసరా వేడుకలు 13 రోజుల విద్యాసంస్థల సెలవులతో మరింత సందడిగా ఉండనున్నాయి. విద్యార్థులు ఆనందంలో మునిగిపోగా, కుటుంబాలు పండగ వేడుకలతో కలసికట్టుగా గడపనున్నారు.
