Telangana: సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే అధికారిక లేఖలు, ప్రత్యుత్తరాలు ఎక్కువగా ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. అయితే గ్రామాల్లోనే కాక నగరాల్లో కూడా ఇంగ్లిష్‌పై పట్టు లేని వారు ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ఉన్నారు. అలాంటి వారు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మొబైల్ ఫోన్ల సహాయంతో ఇంగ్లిష్‌లో ఉన్న పత్రాలను ఫోటో లేదా స్కాన్ చేసి, తమకు అర్థమయ్యే భాషలోకి అనువదించుకుని చదువుతూ అర్థం చేసుకునే పరిస్థితి ఉంది.
ఈ నేపథ్యంలో, దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఒక వినూత్న ప్రయత్నంతో పోలీస్ శాఖలో కొత్త ఒరవడికి నాంది పలికారు. ఆమె తన దర్యాప్తును పూర్తిగా మాతృభాష తెలుగులో నిర్వహించి, స్థానికంగా వాడుకలో ఉన్న సరళమైన తెలుగులోనే కోర్టుకు అభియోగపత్రం (ఛార్జ్‌షీట్) దాఖలు చేశారు.
ప్రజల మాతృభాషలోనే ప్రభుత్వ కార్యాలయ పనులు జరగడం ఉత్తర భారతదేశంలో సాధారణంగా కనిపిస్తుంటుంది. కానీ తెలంగాణలో, ముఖ్యంగా దుండిగల్ ప్రాంతంలో, హెడ్ కానిస్టేబుల్ స్వరూప ఈ మార్పుకు శ్రీకారం చుట్టారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో, 2025 సంవత్సరంలో తనకు కేటాయించిన రెండు కేసుల్లో ఆమె పూర్తిగా తెలుగులోనే అభియోగపత్రాలు తయారు చేసి కోర్టుకు సమర్పించారు.
ఈ కేసుల్లో మొదటిది బౌరంపేట్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తికి సంబంధించినది. అతడు తన కిరాణా దుకాణంలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచి విక్రయాలు చేస్తున్నట్టు గుర్తించిన దుండిగల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని, ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశారు. అనంతరం, ఆ కేసుకు సంబంధించిన అభియోగపత్రాన్ని పూర్తిగా తెలుగులో రూపొందించి మేడ్చల్ ప్రథమ తరగతి మేజిస్ట్రేట్ కోర్టుకు సమర్పించారు.
