Telangana: సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర ఆలయానికి వచ్చే భక్తులకు ముఖ్య గమనిక. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల కారణంగా కొద్ది రోజులపాటు ప్రధాన ఆలయంలో దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
ఈ సమయంలో భక్తుల కోసం అర కిలోమీటర్ దూరంలో ఉన్న భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అక్కడే భక్తులు స్వామివారి దర్శనం పొందే అవకాశం ఉంటుంది. అలాగే, సాధారణంగా రాజరాజేశ్వర ఆలయంలో జరిగే ఆర్జిత సేవలు, అభిషేకాలు, కోడె మొక్కులు, అన్నపూజ, నిత్యకళ్యాణం, చండీహోమం వంటి అన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు తాత్కాలికంగా భీమేశ్వర ఆలయంలోనే నిర్వహిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
రాజరాజేశ్వర ఆలయంలో ఈ కాలంలో కేవలం ఏకాంత సేవలు మాత్రమే జరిపేలా నిర్ణయం తీసుకున్నారు. భక్తులు భీమేశ్వర ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాలని సూచించారు.
అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత సాధారణ దర్శనాలను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. భక్తులు సహనంతో, సహకారంతో ఉండాలని, ఏర్పాట్లను గమనించి దేవస్థానం మార్గదర్శకాలను పాటించాలని కోరారు. ఈ చర్యలు భవిష్యత్‌లో ఆలయ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికేనని స్పష్టం చేశారు.
