Summer: ఈ ఏడాది వేసవి అసాధారణంగా ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు. తాపం పెరిగే కాలంలోనే కొన్నిసార్లు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండటంతో ఈ సమ్మర్ మిక్స్‌డ్ వెదర్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారని భావిస్తున్నారు. ఒక వైపు ఎండ, మరోవైపు అప్పుడప్పుడు వచ్చే వానలతో ఈ వేసవి వేరేలా కనిపించనున్నట్లు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం చలి తగ్గుముఖం పడుతుండగా, ఫిబ్రవరి రెండో వారంతో వేడి పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి రెండో వారం నుంచి ఏప్రిల్ చివరి వరకు ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు మోస్తరు వానలు పడే అవకాశం ఉందని, మరికొన్ని సందర్భాల్లో మబ్బులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొంటున్నారు. అయితే అసలు తీవ్ర ఎండ మాత్రం మే నెల నుంచి మొదలై జూన్ మొదటి వారానికి కొనసాగుతుందని హెచ్చరిస్తున్నారు. 2023తో పోలిస్తే ఈ ఏడాది వేసవి ఇంకా ఎక్కువగా మండిపోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్ నినో ప్రభావం
ఈ వేసవిలో ఎల్ నినో ప్రభావం మరింతగా బలపడే అవకాశం ఉందని దేశీయ, అంతర్జాతీయ వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. 2023లో బలమైన ఎల్ నినో కారణంగా అప్పట్లో అసాధారణంగా ఎండలు నమోదయ్యాయి. ఆ తరువాత 2025 ప్రారంభంలో లా నినాతో మంచి వర్షాలు కురిశాయి మరియు ఉష్ణోగ్రతలు కూడా తగ్గాయి.
కానీ డిసెంబర్ నాటికి లా నినా దశ ముగిసే దశకు చేరగా, ప్రస్తుతం ఎల్ నినో వైపు వాతావరణం మారుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పసిఫిక్ సముద్రంలో వాయువుల దిశ మారుతున్నందున తాపన స్థాయిలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ సహా తెలంగాణలో కూడా మేలో రికార్డు స్థాయి వేడిగాలి నమోదయ్యే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అలాగే రుతుపవనాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉండటంతో వర్షపాతం కూడా తగ్గవచ్చని భావిస్తున్నారు. అయితే ఎల్ నినో తీవ్రత ఎంతవరకు ఉంటుందో తెలుసుకోవాలంటే మే వరకు వేచి చూడాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.
చలి తగ్గుతోంది
రాష్ట్రంలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం మిగతా జిల్లాల కంటే ఉత్తర జిల్లాల్లో కొద్దిగా చలి కొనసాగుతోంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లోనే సింగిల్ డిజిట్ రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. శనివారం రాత్రి కుమ్రంభీం జిల్లాలోని గిన్నెదరిలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌లో 8.7, సంగారెడ్డిలో 8.8, రంగారెడ్డిలో 9.8 డిగ్రీలుగా రికార్డు అయ్యాయి. మిగతా ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 10 నుండి 14 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. హైదరాబాద్‌లోనూ 10 డిగ్రీలకు పైగానే రాత్రి ఉష్ణోగ్రతలు ఉండిపోయాయని నమోదు అయింది.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాలతో పాటు రాష్ట్ర పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో కూడా కొంత చలి ప్రభావం కొనసాగుతుందని, ఆ తరువాత రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని తెలిపింది.
