Medaram Jatara: తెలంగాణలో గిరిజనుల అత్యంత పెద్ద పండుగగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ఈ నెల 28 నుండి ప్రారంభమైంది. ఈ మహా జాతర ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. వేలాదిగా వచ్చే భక్తులు అమ్మవార్లను దర్శించుకుని టన్నులకొద్దీ బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ ప్రత్యేక ఆచారం. జాతర సమయంలో గద్దెల పరిసరాలు బెల్లంతో నిండిపోవడంతో బంగారపు వెలుగుల్లా కనిపిస్తాయని స్థానికులు చెబుతారు.
ఈ బెల్లం సమర్పించే సంప్రదాయం కాకతీయుల కాలం నుంచే కొనసాగుతోందని చరిత్ర చెబుతోంది. పూర్వం భక్తులు ఎడ్ల బండ్లపై దూరదూరాల నుంచి ప్రయాణించి ఇక్కడి అడవులలో వారం రోజుల పాటు తలదాచుకునేవారట. అప్పట్లో బెల్లం, బెల్లం పానకం శరీరానికి శక్తి ఇచ్చే ఆహారంగా ఉపయోగించేవారు. అందుకే దానిని అత్యంత విలువైనదిగా భావించి, అమ్మవార్లకు సమర్పించడం ప్రారంభమైందని పెద్దలు చెబుతారు.
సాధారణంగా అన్ని జాతరల్లో భక్తులు తాము కోరుకున్న నైవేద్యాలను దేవతలకు సమర్పిస్తారు. కానీ మేడారంలో ఉన్న ఆదివాసీల ఆచారాలు కొంత ప్రత్యేకం. వారికి బెల్లం, ఉప్పు అత్యంత ప్రీతికరమైనవి. ఒకప్పుడు ఇవి దొరకడానికి కూడా కష్టమైన కారణంగా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకునేవారు. అందుకే దీనిని ఖరీదైన వస్తువుగా భావించి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పించే ఆచారం పెరిగింది. కాలక్రమేణా ఈ బెల్లాన్ని ‘బంగారం’ అని పిలవడం మొదలైందని స్థానిక కథనాలు చెబుతున్నాయి.
మరో విశ్వాసం ప్రకారం, అమ్మవార్ల గద్దెల వద్ద ఉన్న బెల్లాన్ని చిటికెడు మాత్రమే తీసుకెళ్లినా అది అమ్మవారి ఆశీర్వాదంగా భావిస్తారు. అందుకే కిలోలకొద్దీ బెల్లం సమర్పించే భక్తులు, కనీసం చిటికెడుైనా ఇంటికి తీసుకెళ్లేందుకు ఆరాటపడుతుంటారు. అలాగే బెల్లం సమర్పిస్తే కుటుంబం క్షేమంగా ఉంటుందని, కష్టాలు తొలగిపోతాయని అనేక మంది నమ్ముతారు.
గమనిక: ఇక్కడ చెప్పబడిన వివరాలు మత విశ్వాసాలు, ఆచారాలు, సంప్రదాయాల ఆధారంగా ఉన్నాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు.
