Crime: భార్యను కాపురానికి పంపలేదన్న కక్షతో అత్తామామలను హత్య చేసిన అల్లుడు

Son-in-law kills in-laws for not sending wife to his house at nallagerla og east godavari dist

Son-in-law kills in-laws for not sending wife to his house at nallagerla og east godavari dist

Crime: తూర్పు గోదావరి జిల్లా ఘంటావారిగూడెంలో దారుణం జరిగింది. భార్యను తిరిగి కాపురానికి పంపలేదని కక్ష పెంచుకున్న ఓ వ్యక్తి, అత్తామామలను చాకుతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో అతని భార్య మాత్రం త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే… ఏలూరు జిల్లా భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన ఏకుల బాబూరావు (58) కుటుంబంతో కలిసి నల్లజర్ల మండలం ఘంటావారిగూడెంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య శారద (47), కుమారుడు అప్పారావు, కుమార్తె నాగేశ్వరి ఉన్నారు. అప్పారావు ఉద్యోగం కారణంగా విశాఖలో ఉంటాడు.

పదేళ్ల క్రితం నాగేశ్వరిని ఏలూరు జిల్లా దెందులూరు మండలం గంగన్నగూడెం గ్రామానికి చెందిన మరీదు కోటేశ్వరరావుతో వివాహం చేశారు. బాబూరావు స్థానికంగా హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే కోటేశ్వరరావు తరచూ భార్యను వేధించడంతో, ఏడాది క్రితం నాగేశ్వరి తన ఇద్దరు కుమారులతో కలిసి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది.

అప్పటి నుండి కోటేశ్వరరావు తరచూ అత్తారింటికి వచ్చి గొడవలు సృష్టిస్తూ, భార్యను తిరిగి తన వద్దకు పంపాలని ఒత్తిడి చేసేవాడు. నెల క్రితం కూడా కోటేశ్వరరావు, బాబూరావును గొంతు నులుముతుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. బుధవారం సాయంత్రం హోటల్ పనులు ముగించుకుని బాబూరావు, శారద, నాగేశ్వరి ఇంటికి వచ్చిన సమయంలో కోటేశ్వరరావు అక్కడికి వచ్చి దుర్భాషలాడాడు.

ఆ క్రమంలో శారదపై చాకుతో గొంతుపై పొడవడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ అరుపులు విని బయటకు వచ్చిన బాబూరావుపై కూడా కత్తితో దాడి చేయగా, ఆయన తీవ్రంగా రక్తస్రావం చెంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దృశ్యం చూసిన నాగేశ్వరి భయంతో ఇంట్లోకి పరుగెత్తి వెళ్లి తలుపులు వేసుకొని తన ప్రాణాలను రక్షించుకుంది. అనంతరం నిందితుడు అక్కడినుంచి పారిపోయాడు.

స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. నల్లజర్ల పోలీస్ స్టేషన్‌కు డీఎస్పీ దేవకుమార్, సీఐ బాలశౌరి, ఎస్సై రామారావు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Also Read: MEIT: మైండ్‌స్పేస్ REIT సుస్థిరత-ఆధారిత బాండ్ల ద్వారా రూ. 550 కోట్లు సమీకరణ

Crime: భార్యను కాపురానికి పంపలేదన్న కక్షతో అత్తామామలను హత్య చేసిన అల్లుడు