Medaram Jatara: జనవరి 28 నుంచి ప్రారంభమయ్యే మేడారం మహాజాతరలో ట్రాఫిక్ నియంత్రణను అత్యంత కీలక అంశంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు నెల రోజుల ముందుగానే వివిధ రూట్లను పరిశీలించి వాహనాల క్రమబద్ధీకరణకు ఏర్పాట్లు ప్రారంభించారు. ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రూపొందించి వాహనాల రాకపోకలను స్పష్టంగా గైడ్ చేయనున్నారు.
మేడారం జాతరకు నలుదిశల నుంచి వాహనాలు వస్తాయి. ఏ మార్గం గుండా వచ్చిన వాహనం జాతరకు ఎలా చేరుకోవాలి, తిరుగు ప్రయాణంలో ఏ దారి వినియోగించాలి అనే విషయంలో ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే ప్రతి మార్గానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు. ఈ సారి సుమారు 5 లక్షల ప్రైవేట్ వాహనాలు వచ్చే అవకాశం ఉందని అంచనా.
వరంగల్ వైపు నుంచి వచ్చే వాహనాలు
వరంగల్ నుంచి జాతరకు వచ్చే వాహనాలు వెంగళాపూర్, నార్లాపూర్, చింతల్, కన్నెపల్లి, కొత్తూరు, యాసంగి తోగు, ముత్యాలగూడెం వంటి పార్కింగ్ ప్రదేశాలను వినియోగిస్తాయి. తిరుగు మార్గంలో నార్లాపూర్ – బయ్యక్కపేట – గొల్ల బుద్దారం – దూదేకులపల్లి – కమలాపూర్ క్రాస్ – భూపాలపల్లి – గణపురం క్రాస్ రోడ్ – రేగొండ – పరకాల – అంబాల క్రాస్ – కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల – వరంగల్ బైపాస్ – కరుణాపురం – చిన్నపెండ్యాల మీదుగా వరంగల్ చేరుకుంటాయి.
మహారాష్ట్ర, రామగుండం, కరీంనగర్, కాళేశ్వరం వైపు నుంచి
ఈ దారుల నుంచి వచ్చే వాహనాలు కాటారం వద్ద ఎడమ వైపుకు తిరిగి పెగడపల్లి – కాల్వపల్లి – ఊరట్టం పార్కింగ్ ప్రాంతాలకు చేరుతాయి. తిరుగు ప్రయాణం ఊరట్టం నుండి నార్లాపూర్ – బయ్యక్కపేట – కమలాపూర్ టీ జంక్షన్ – కుడివైపుకు తిరిగి కాటారం – కాళేశ్వరం – రామగుండం – మహారాష్ట్ర వైపు కొనసాగుతుంది.
ఖమ్మం జిల్లా నుంచి
ఖమ్మం జిల్లాకు చెందిన భద్రాచలం – మణుగూరు – బయ్యారం – మంగపేట – ఏటూరునాగారం – చిన్నబోయినపల్లి క్రాస్ – కొండాయి మీదుగా ఊరట్టం పార్కింగ్ ప్రాంతానికి చేరవచ్చు.
ఆర్టీసీ సేవలు
జాతరకు రాష్ట్రంలోని పలు డిపోల నుంచి మొత్తం 4,000 బస్సులు నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. వరంగల్ నుంచి ఆరెపల్లి – గుడెప్పాడు – మల్లంపల్లి – ములుగు – జంగాలపల్లి – పస్రా – తాడ్వాయి మీదుగా ఆర్టీసీ బస్సులు మేడారం చేరుకుంటాయి.
పార్కింగ్ ప్రదేశాలు
ప్రైవేట్ వాహనాల కోసం:
వెంగళాపూర్, నార్లాపూర్, చింతల్, కన్నెపల్లి, కొత్తూరు, యాసంగి తోగు, ముత్యాలగూడెం, ఊరట్టం
గద్దెల నుంచి దూరాలు (కిలోమీటర్లలో)
-
ఆర్టీసీ బస్టాండ్: 0.5
-
ఊరట్టం: 4
-
కన్నెపల్లి: 4
-
కొత్తూరు: 4
-
చింతల్: 6
-
నార్లాపూర్: 6
-
వెంగళాపూర్: 8
-
జంపన్న వాగు పార్కింగ్: 2
-
చిలకల గుట్ట: 1
-
జంపన్న వాగు: 3
అదనంగా:
-
గంగారం మండలం పూనుగుండ్లలోని పగిడిద్దరాజు గుడి నుంచి మేడారం గద్దెల వరకు 70 కిలోమీటర్లు
-
ఏటూరునాగారం మండలం కొండాయిలోని గోవిందరాజులు గుడి నుంచి 18 కిలోమీటర్లు
