IIT: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (IIT హైదరాబాద్) విద్యార్థికి అరుదైన ఘనత దక్కింది. ఈ ఏడాది జరిగిన ప్రాంగణ నియామకాల్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్‌కు ఏకంగా రూ. 2.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్ లభించింది. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ కంపెనీ ఈ భారీ ప్యాకేజీతో అతడిని ఎంపిక చేయడంతో, IIT హైదరాబాద్ స్థాపన తర్వాత అత్యధిక వేతనం అందుకున్న విద్యార్థిగా ఎడ్వర్డ్ రికార్డు సృష్టించాడు.
21 ఏళ్ల ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (CSE) విభాగంలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ అతడిని ఉద్యోగానికి ఎంపిక చేసింది. గతంలో ఇదే సంస్థలో రెండు నెలల పాటు వేసవి ఇంటర్న్‌షిప్ చేసిన ఎడ్వర్డ్, ఇప్పుడు ఆ అనుభవాన్ని ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్‌గా మార్చుకున్నాడు. ఈ ఏడాది జూలైలో అతడు ఆ కంపెనీలో ఉద్యోగంలో చేరనున్నాడు.
@IITHyderabad records an outstanding placement season in 2025, with 24 international offers secured and average packages increasing by 75%.
This success reflects the combined efforts of our talented students, dedicated faculty, and the Office of Career Services (OCS), IIT… pic.twitter.com/MB9mHf793n
— IIT Hyderabad (@IITHyderabad) January 1, 2026
ప్రస్తుత ప్రాంగణ నియామకాల్లో మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి కూడా రూ. 1.1 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం లభించినట్లు IIT హైదరాబాద్ వెల్లడించింది. గతంలో ఈ సంస్థలో అత్యధిక వేతన ప్యాకేజీ 2017లో రూ. 1 కోట్లుగా నమోదైంది.
ఎడ్వర్డ్ హైదరాబాద్‌లో జన్మించి పెరిగాడు. 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు బెంగళూరులో విద్యాభ్యాసం చేశాడు. 2022లో JEE మెయిన్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ 1100, JEE అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా ర్యాంక్ 558 సాధించాడు. అలాగే, గత ఏడాది నవంబరులో జరిగిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT)లో 99.96 శాతం పర్సంటైల్‌ను పొందాడు.
అంతేకాకుండా, 2021లో నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) నుంచి స్కాలర్‌షిప్ పొందాడు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో కేవీపీవై (కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన) ఫెలోషిప్ కూడా పూర్తి చేశాడు. ఈ విజయాలు ఎడ్వర్డ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
