Telangana: ‘అంతా బాగానే ఉంది.. కానీ కవిత ఒక్కరి గురించి చెప్పడం మర్చిపోయింది’

raghunandan rao reaction on kavitha comments after resigns to MLC post

raghunandan rao reaction on kavitha comments after resigns to MLC post

Telangana: బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని, తాము చాలా కాలంగా చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె బయటపెడుతున్నారని అన్నారు.

రఘునందన్ రావు గుర్తుచేస్తూ – “జడ్పీ అధ్యక్షుడిగా నన్ను ఎవరు ఓడించారో అప్పుడే కేసీఆర్‌కి చెప్పాను. కానీ ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2024 మార్చి 20న ఎయిరిండియా విమానంలో రేవంత్ రెడ్డి, హరీశ్ రావు ఇద్దరూ బిజినెస్ క్లాస్‌లో కలిసి ప్రయాణించారు. ఈ విషయం గురించి నేను మార్చి 22న మీడియా ముందు చెప్పాను. వారు కుమ్మక్కై నన్ను మెదక్‌లో ఓడించడానికి యత్నించారు” అని ఆరోపించారు.

కవిత వ్యాఖ్యలపై మాట్లాడుతూ – “బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిపై ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కాకముందే మాట్లాడి ఉంటే బాగుండేది. ఆమె మాటలను బట్టి చూస్తే బీఆర్ఎస్‌ మొత్తం అవినీతి పునాదుల మీద నిర్మించబడిందని అర్థమవుతోంది. కేసీఆర్ క్లబ్బులు బంద్ చేస్తే, మీరు పబ్బులు నడిపిన సంగతిని ప్రజలు మరచిపోలేదు. ‘టానిక్’ అంశం చిన్నది. కానీ ఎమ్మెల్సీల అక్రమాలు చాలా పెద్దవి. రూ.750 కోట్లతో పోచంపల్లి విల్లా కడుతుంటే, మరో ఎమ్మెల్సీ నవీన్ రావు అక్రమాలకు కూడా అడ్డూ అదుపూ లేకుండా పోయింది” అని ఆరోపించారు.

ఇకపై కవిత ఇంకా మరిన్ని విషయాలు చెప్పాలని రఘునందన్ సూచించారు. “బీఆర్ఎస్ పెద్దలు చేసిన అవినీతిని ఆమె బయటపెడితే బాగుంటుంది. కుటుంబాన్ని కాపాడుకోవాలనుకోవడంలో తప్పులేదు. కానీ అధికారంలో ఉన్నప్పుడు నేతల అవినీతిపై ఎందుకు మాట్లాడలేదు? బొల్లారం, పటాన్‌చెరు, ఆదిబట్ల, బాలానగర్ భూముల కన్వర్షన్ అంశాల్లో మాట్లాడుతారని భావించాం. కానీ ఆమె మౌనం వహించారు. మేము చెబితే కక్ష సాధింపు అంటారు. అందుకే ఇప్పుడు కవితనే బయట పెట్టాలి” అని అన్నారు.

అలాగే – “కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వయిరీ చేయాలి. హరీశ్ రావు పాల వ్యాపారం గురించి అయోధ్యరెడ్డి ట్వీట్ చేశారు. ఆ విషయంలోనూ స్పందించాలి. మోకిలాలో పోచంపల్లి చేస్తున్న ప్రాజెక్టులు, నవీన్ రావు అక్రమాలపై సీఎం రేవంత్ రెడ్డి, ఏసీబీ వెంటనే చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

కవిత అందరి గురించి మాట్లాడి ఒకరిని మర్చిపోయిందని రఘునందన్ అన్నారు. “సంతోష్ రావు బంధువు డీసీపీ సందీప్ రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడు. అతను పోలీసులలో ‘సూపర్ మ్యాన్’. ఫోన్ ట్యాపింగ్, డబ్బులు పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. నార్సింగి టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నప్పుడు నా ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి నానాయాగి చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి వ్యవహారాలపై కవిత మాట్లాడుతారని అనుకున్నాం. కానీ ఆమె ఆ అంశాలను కూడా ప్రస్తావించలేదు” అని విమర్శించారు.

Also Read: Revanth: మీ గొడవల్లోకి మమ్మల్ని లాగొద్దు: కవిత వ్యాఖ్యలపై సీఎం ఘాటు రిప్లై

Telangana: ‘అంతా బాగానే ఉంది.. కానీ కవిత ఒక్కరి గురించి చెప్పడం మర్చిపోయింది’