Ragging: యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

Ragging stir in Gurukul school in Yadadri Bhuvanagiri district

Ragging stir in Gurukul school in Yadadri Bhuvanagiri district

Ragging: యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాల–కళాశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్లు ర్యాగింగ్ చేసిన ఘటన మంగళవారం బయటపడింది. పదో తరగతి విద్యార్థి ముస్తాల కౌశిక్ వర్ధన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండడం సీనియర్ ఇంటర్ విద్యార్థులకు నచ్చక, అర్ధరాత్రి దాడి చేసినట్లు సమాచారం.

మోటకొండూరు మండలం చాడ గ్రామానికి చెందిన లావణ్య–సుదర్శన్ దంపతుల ఏకైక కుమారుడు కౌశిక్ వర్ధన్ ఐదో తరగతి నుంచి ఇదే గురుకులంలో చదువు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం పదో తరగతి ‘ఏ’ సెక్షన్‌లో చదువుతున్న కౌశిక్ చెబుతున్న వివరాల ప్రకారం, నవంబర్ 29వ తేదీ శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో 20మంది ఇంటర్ విద్యార్థులు అతను నిద్రిస్తున్న 20వ గదిలోకి ప్రవేశించి కర్రలు, బ్యాట్లతో దాడి చేశారు. ఈ దాడిని కౌశిక్ స్నేహితుడు సెల్‌ఫోన్‌లో రికార్డు చేయడం గమనించిన సీనియర్లు గదిలోని లైట్లు ఆర్పి మరింత హింసకు పాల్పడ్డారు.

కౌశిక్‌ను రక్షించేందుకు ముందుకొచ్చిన పదో తరగతి విద్యార్థులు చందు, రాహుల్, అభివర్ధన్, అరుణ్, ఈశ్వర్‌లను కూడా విచక్షణారహితంగా కొట్టినట్లు సమాచారం. చందు (నాగార్జునసాగర్), రాహుల్ (రామన్నపేట) తీవ్రగాయాలతో భువనగిరి ఆసుపత్రిలో చేరగా, మిగతా విద్యార్థులకు గురుకుల ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అందించారు.

సోషల్ మీడియాలో ఈ దాడి వీడియోలు వైరల్ కావడంతో కౌశిక్ తల్లిదండ్రులు, బంధువులు మంగళవారం హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కొడుకును చంపే ప్రయత్నం చేశారని, అతని వీపు– ఛాతిపై ఉన్న గాయాలను చూపిస్తూ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థుల క్రమశిక్షణపట్ల గురుకుల నిర్వహణ పూర్తిగా విఫలమైందని తల్లిదండ్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈ ఘటన జరిగి నాలుగు రోజులైనా దాచిపెట్టడానికి ప్రయత్నించడం పై వారు ప్రశ్నించారు. పాఠశాలలో విద్యార్థులు గుట్కా, మద్యం, సిగరెట్లకు బానిసలయ్యారనే ఆరోపణలు కూడా తల్లిదండ్రులు చేశారు. తమ కుమారునికి టీసీ ఇవ్వాలని వారు పట్టు పట్టారు. వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సీనియర్లకు నచ్చకపోవడంతోనే దాడి చేశారని కౌశిక్ వర్ధన్ పేర్కొన్నాడు. దాడి చేసిన 20 మంది విద్యార్థులపై కేసులు నమోదు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

తాము న్యాయం అందుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు.

ఈ నేపథ్యంలో ప్రిన్సిపాల్ సుధాకర్ మాట్లాడుతూ—సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత గత రెండు రోజులుగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చామని, పూర్వాపరాలు తెలుసుకొని ఏడుగురు విద్యార్థులపై సస్పెన్షన్ విధించామని, డిసెంబర్ 4న పేరెంట్స్‌తో సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అయితే పాఠశాలలో సెల్‌ఫోన్ల వినియోగం, విద్యార్థులు అనుమతి లేకుండా బయట తిరగడం, క్రమశిక్షణ సడలిపోవడం వంటి అనేక అంశాలు బయటకు వస్తుండటంతో గురుకుల నిర్వహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అరాచక గ్యాంగ్‌ రీతిలో అర్ధరాత్రి దాడులు జరగడం, వాటిని దాచిపెట్టాలనే ప్రయత్నాలు జరిగిందన్న ఆరోపణలతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి విచారణ జరిపి సమస్యలను మూలం నుంచి సరిచేయాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన పెళ్లికి డేట్ ఫిక్స్‌

Ragging: యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం