Tirumala: ఆగస్టు 15వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తిరుమలలో ఓ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లికి చెందిన 61 ఏళ్ల మేడం శ్రీనివాసులు కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు.
గుండెపోటుతో కుప్పకూలిన భక్తుడు
రాత్రి 9:30 గంటలకు దర్శనం పూర్తి చేసుకున్న శ్రీనివాసులు, లడ్డూ ప్రసాదాలు తీసుకుని మ్యూజియం వైపు వెళ్తుండగా పడమర మాడా వీధిలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు, పక్కనే ఉన్న భక్తులు ఆందోళనకు గురయ్యారు.
సమయస్ఫూర్తితో స్పందించిన కానిస్టేబుల్
ఆ సమయంలో విధుల్లో ఉన్న వన్‌టౌన్ పోలీస్ కానిస్టేబుల్ గురప్ప ఈ పరిస్థితిని గమనించి వెంటనే స్పందించారు. గుండెపోటుగా గుర్తించి సీపీఆర్ చేసి శ్రీనివాసుల ప్రాణాన్ని రక్షించారు. కొద్దిసేపటికి ఆయన కాస్త కోలుకోవడంతో అంబులెన్స్‌లో తిరుమల అశ్విని ఆసుపత్రికి తరలించారు.
చికిత్సతో ప్రాణాపాయం తప్పిన శ్రీనివాసులు
అశ్విని ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం, మెరుగైన వైద్యం కోసం శ్రీనివాసులను తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సమయానికి చికిత్స చేయడంతో ఆయన పూర్తిగా కోలుకున్నారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసి స్వగ్రామానికి వెళ్లేలా చేశారు.
అభినందనలు కురిపించిన అధికారులు
సమయస్ఫూర్తితో ప్రాణం కాపాడిన కానిస్టేబుల్ గురప్పను కుటుంబ సభ్యులు, భక్తులు, అధికారులు హృదయపూర్వకంగా అభినందించారు.
