Panchayat Elections: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. డిసెంబర్ 10 నుంచి 20 మధ్య మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ నిర్వహించే అవకాశముందని అంచనా. ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన ఎస్ఈసీ, ఎటువంటి లోపాలు లేకుండా పకడ్బందీగా ఎన్నికలు జరపాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో పంచాయతీ ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక ప్రజాపాలన వారోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్నందున, అవి పూర్తైన తర్వాతే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే తీర్మానం చేశారు.
గతంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. ప్రభుత్వం ఇటీవల బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసినప్పటికీ, రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ హైకోర్టు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి.
అదే సమయంలో, ఈ నెల 24లోగా ఎన్నికల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధమవడం గమనార్హం.
