Muncipal Polls: ఓడిపోతానన్న భయంతో కుక్కర్లు పంచాడు

Municipal Polls: Fearing defeat, he distributed cookers at Aswaraopet

Municipal Polls: Fearing defeat, he distributed cookers at Aswaraopet

Muncipal Polls: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఓటర్ల తీర్పు ప్రస్తుతం బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, పుర ప్రజలు ఎవరికి పట్టం కట్టారో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు ప్రధాన పార్టీలూ మెజారిటీ స్థానాల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక ఆసక్తికరమైన, వివాదాస్పద ఘటన చోటుచేసుకుని రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలోని 10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన హరిబాబు ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికీ తిరిగి ఓటర్లను కలిశాడు. ఓటు వేయాలని కోరుతూ నగదు పంపిణీ చేశాడనే ఆరోపణలతో పాటు, గిఫ్ట్‌లుగా కుక్కర్లు కూడా ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. పోలింగ్ రోజువరకు అంతా సజావుగానే సాగింది. కానీ, పోలింగ్ పూర్తయ్యాక ఓడిపోతానేమోనన్న భయం అభ్యర్థిలో మొదలైందని సమాచారం.

దీంతో హరిబాబు మళ్లీ ఓటర్ల ఇళ్లకు వెళ్లి, తాను ఇచ్చిన డబ్బులు, గిఫ్ట్‌లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గొడవకు దిగినట్లు ఆరోపణలు వచ్చాయి. కౌంటింగ్‌కు ముందే ఇలా ప్రవర్తించడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “మేము ఓటు వేయలేదని ఆరోపణ చేస్తే ఎలా?” అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు గిఫ్ట్‌గా ఇచ్చిన కుక్కర్లను రోడ్డుపై పడేసి ధర్నా చేపట్టారు.

నిన్న ఒక్కో ఓటుకు రూ.2,500తో పాటు కుక్కర్ ఇచ్చారని, కానీ ఫలితాలు రాకముందే ఓడిపోతానని భావించి ఇవన్నీ తిరిగి ఇవ్వాలని గొడవపడటం అన్యాయమని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన అశ్వరావుపేటలో తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికల వేళ ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read: Gold: విదేశాల నుంచి ఎంత బంగారం తీసుకురావొచ్చంటే..

Muncipal Polls: ఓడిపోతానన్న భయంతో కుక్కర్లు పంచాడు