Medaram: మేడారం మహాజాతరకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జాతర ప్రారంభమైనప్పటికీ ఆమె హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యంగా మంత్రుల మధ్య ఇంకా దూరం కొనసాగుతుందన్న చర్చలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
జాతర తొలి రోజున సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా వనదేవతలకు అధికారికంగా మంత్రి సీతక్క స్వాగతం పలికారు. మరోవైపు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి మేడారానికి వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు.
అయితే దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాజాతరకు సంబంధిత శాఖా మంత్రి అయిన కొండా సురేఖ హాజరుకాకపోవడం గమనార్హంగా మారింది. సాధారణంగా ఈ తరహా కీలక కార్యక్రమాల్లో శాఖా మంత్రి పాల్గొనడం ఆనవాయితీగా ఉండగా, ఈసారి ఆమె రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మంత్రుల మధ్య కొనసాగుతున్న విభేదాల కారణంగానే కొండా సురేఖ మేడారం జాతరకు దూరంగా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ దూరం ఇంకా తొలగలేదనే సంకేతంగానే ఆమె గైర్హాజరు కనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
