Tragedy: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రాయవరం ప్రాంతంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా పేలుడు చోటుచేసుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలో ఆరుగురు సజీవదహనమై దుర్మరణం చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరిని అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు.
ప్రమాదం సంభవించిన సమయంలో ఆ బాణసంచా తయారీ కేంద్రంలో సుమారు 40 మంది కార్మికులు పనిచేస్తున్నారు. పేలుడు తీవ్రతతో షెడ్డు గోడలు కూలిపోయాయి. శిథిలాల కింద ఇంకా కొంతమంది చిక్కుకుని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. సహాయక బృందాలు కూడా రక్షణ చర్యలను వేగంగా చేపట్టాయి.
ఘటనపై రామచంద్రపురం ఆర్డీవో అఖిల పరిశీలన జరిపారు. జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ కూడా స్పందిస్తూ, “వారం క్రితమే స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది ఈ బాణసంచా కేంద్రాన్ని పరిశీలించి రక్షణ చర్యలు సక్రమంగా ఉన్నాయని నివేదిక సమర్పించారు” అని తెలిపారు. అయితే అగ్నిప్రమాద నివారణ పరికరాలు సరిగా పనిచేశాయా లేదా అనే అంశంపై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను కనుగొనేందుకు అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు.
