Maoists: మావోయిస్టు దళాల్లో కీలక వ్యూహకర్తగా దాదాపు పదిేళ్లు అండర్‌గ్రౌండ్‌లో పనిచేసిన హిడ్మా మరణంపై మావోయిస్టుల కేంద్ర కమిటీ స్పందించింది. అభయ్ పేరిట విడుదల చేసిన లేఖలో, హిడ్మాను పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌లో చంపేశారంటూ తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఆయుధాలు లేని సమయంలో, వైద్యం కోసం విజయవాడకు వచ్చిన హిడ్మాను ఒక ద్రోహి ఇచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్ట్ చేసి, తరువాత హత్య చేశారని కేంద్ర కమిటీ పేర్కొంది. ఈ సంఘటనను ‘మారేడుమిల్లి ఎన్‌కౌంటర్’గా కట్టుకథగా తయారు చేశారని ఆరోపించింది. ఇదే తరహాలో శంకర్‌ను కూడా చంపి, ‘రంపచోడవరం ఎన్‌కౌంటర్’ అంటూ మరో తప్పుడు కథనాన్ని సృష్టించారని మావోయిస్టులు అన్నారు.
బూటకపు ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 23ను దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని ప్రజాసంఘాలు, ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రజల కోసం పోరాడిన నాయకులను ఇలా హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా లేఖలో పేర్కొంది. భగత్‌సింగ్, కొమరం భీం, అల్లూరి సీతారామరాజుల్లా… హిడ్మా కూడా ప్రజా ఉద్యమాల్లో నిలిచిపోయే నాయకుడని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. పీడితుల హక్కుల కోసం పోరాడిన హిడ్మా చరిత్ర భవిష్యత్ తరాలకు స్ఫూర్తి అవుతుందని తెలిపింది.
హిడ్మా, ఆయన భార్య రాజే, అలాగే ఇటీవల ఎన్‌కౌంటర్లలో మరణించిన ఇతర మావోయిస్టులకు కేంద్ర కమిటీ జోహార్లు తెలిపింది. వారి ఆశయాలను ముందుకు తీసుకుంటూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని శపథం చేస్తూ లేఖలో పేర్కొంది. ప్రజా హక్కుల కోసం పోరాటాన్ని మరింత వేగవంతం చేస్తామని కూడా స్పష్టం చేసింది.
అదే సమయంలో, ఆయుధ పోరాటం జరుగుతున్న రాష్ట్రాల్లో ఎన్నికల వ్యవస్థపై కూడా కేంద్ర కమిటీ విమర్శలు చేసింది. ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తోందని, అధికారం లో ఉన్న నేతలు అధికార యంత్రాంగాన్ని వాడుకుని బీహార్ ఎన్నికల్లో భారీ మోసం చేశారని ఆరోపించింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రజలు గళమెత్తాలని పిలుపునిచ్చింది.
