Rajamouli: వారణాసి టైటిల్ లాంఛ్ ఈవెంట్ లో దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆంజనేయుడు సినిమా తయారీకి వెనకుండి సహాయం చేస్తాడని తండ్రి చెప్పిన మాటలు తనకు భావ్యంగా అనిపించడం లేదని ఆయన పేర్కొన్న వీడియో వైరల్ అయ్యింది. దీంతో రాజమౌళి నాస్తికుడు అనే విమర్శలు, దేవుళ్లపై సినిమాలు తీస్తూ నమ్మకం లేకపోవడంపై ప్రశ్నలు వస్తున్నాయి.
ఈ ఘటనపై బీజేపీ నేత మాధవీలత కూడా స్పందించారు. వీడియోను విడుదల చేయడానికి మీకు ఏవో ఇబ్బందులు ఉన్నట్టు అనిపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. ఆంజనేయస్వామి సహాయం భావ్యంగా అనిపించడం లేదని చెప్పేవారు, బాహుబలి సినిమాలో శివలింగాన్ని ఎత్తించిన సన్నివేశంతో కోట్లు సంపాదించారని గుర్తు చేశారు. అప్పుడు శివుడి ఆలయాలకు ఏమైనా దానాలు చేశారా అని ప్రశ్నించారు.
కుల వృత్తులు చేసుకునేవారు తమ పనిముట్లను గౌరవిస్తారని, అలాగే దేవుడిని డబ్బు సంపాదన కోసం ఉపయోగిస్తే ఆయన పట్ల గౌరవం చూపడం అవసరమని చెప్పారు. ప్రజలు మనల్ని చూసి ప్రేరణ పొందుతారని గుర్తుచేశారు. కొన్ని సన్నివేశాలు తీశారని మీ వెనుక ఆంజనేయస్వామి లేరు అని అనుకోవడం తగదని కూడా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మాధవీలత చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
