Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం చంద్రగ్రహణం కారణంగా దాదాపు 12 గంటలపాటు మూసివేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. సెప్టెంబరు 7న రాత్రి 9.50 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమై, అర్ధరాత్రి 1.31 గంటలకు ముగియనుంది. సంప్రదాయం ప్రకారం, గ్రహణానికి 6 గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీ.
ఈ క్రమంలో సెప్టెంబరు 7న సాయంత్రం ఆలయం మూసి, 8వ తేదీ ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో తిరిగి తలుపులు తెరుస్తారు. అనంతరం శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించబడుతుంది.తరువాత తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలు ఏకాంతంగా జరుగుతాయి. భక్తులకు దర్శనాన్ని సెప్టెంబరు 8న ఉదయం 6 గంటల నుంచి అనుమతిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా సెప్టెంబరు 7న ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దు చేస్తున్నట్లు తితిదే తెలిపింది. అదే రోజు సాయంత్రం 3 గంటల నుంచి అన్నప్రసాద వితరణ నిలిపివేయబడుతుంది. అయితే సెప్టెంబరు 8న ఉదయం 8.30 గంటల నుంచి అన్నప్రసాదాల పంపిణీ మళ్లీ ప్రారంభమవుతుంది.
భక్తుల సౌకర్యార్థం, సెప్టెంబరు 7 సాయంత్రం నుంచి ముందస్తుగా 30 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేయనున్నట్లు తితిదే అధికారులు వెల్లడించారు. వీటిని వైభోత్సవ మండపం, రామ్ భగీచా, పీఏసీ-1, సీఆర్వో, ఏఎన్సీ ప్రాంతాల్లోని ఫుడ్ కౌంటర్లు, అలాగే శ్రీవారి సేవా సదన్ వద్ద భక్తులకు అందజేస్తారు. భక్తులు ఈ మార్పులను దృష్టిలో ఉంచుకొని తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాలని అధికారులు సూచించారు.
